ఆల్ ఇండియా అన్నా ద్రావిడ మున్నేత్ర ఖజగం(ఏఐఏడీఎంకే) పార్టీ చీఫ్ ఎవరనే దానిపై ఇవాళ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఏఐఏడీఎంకే చీఫ్‌గా ఇడప్పాడి పళనిస్వామియే ఉంటారని కోర్టు తన తీర్పులో పేర్కొన్నది. పన్నీరుసెల్వం పెట్టుకున్న అభ్యర్థనను కోర్టు కొట్టిపారేసింది. జస్టిస్ దినేశ్ మహేశ్వరి నేతృత్వంలోని బెంచ్ ఈ తీర్పును వెల్లడించింది. గత ఏడాది జూలై 11న జరిగిన పార్టీ సమావేశాల సమయంలో రూపొందించిన సవరణల ఆధారంగా ధర్మాసనం తీర్పును వెలువరించింది.
ఈపీఎస్‌కు సుప్రీంకోర్టు పచ్చజెండా ఊపడంతో.. చెన్నైలోని అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయం వద్ద సంబరాలు మొదలయ్యాయి. పళనిస్వామి మద్దతుదారులు ర్యాలీ తీశారు. స్వీట్లు పంచుకున్నారు. ప్రస్తుతం అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా పళనిస్వామి కొనసాగుతున్నారు. ఇక నుంచి ఆ బాధ్యతల్లో ఆయనే ఉండనున్నారు. మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం సమర్ధించింది.