Saturday, November 23, 2024

అక్షర తూణీరం

అందరికీ అవే అక్షరాలు
అతని చేతుల్లో మాత్రం ఆయుధాలవుతాయి..
అందరికీ అవే పదాలు..
అతని రాతల్లో పొగరుగా తలెగరేస్తాయి.

కొన్నిసార్లు మార్మికంగా..
అర్థమయ్యీకానట్టుంటాయి.

కొన్ని సార్లు మరఫిరంగుల్లా..
తప్పించుకోడానికి వీల్లేకుండా చేస్తాయి.

కొన్నిసార్లు కవిత్వంలా..
మనసుని సున్నితంగా తాకుతాయి…

కొన్నిసార్లు ఖడ్గంలా..
మొద్దుచర్మాలని కోసుకుంటూ వెళ్ళిపోతాయి.

ఆ ఒడుపు..
ఒక్కోసారి అక్షరానిది…ఒక్కోసారి ఆలోచనది..

ఆ విరుపు..
ఒక్కోసారి వాక్యానిది .. ఒక్కోసారి వ్యూహానిది..
పాతికేళ్ళుగా కే. శ్రీనివాస్ రాతల్ని ప్రేమిస్తున్నా..
ఈరోజు రాసినట్టు ఆయనే ఎప్పుడూ రాయలేదని ప్రతిసారీ అనిపిస్తుంది.

ఇవాళ కూడా “నీగ్గూడ ఉండాలె గదనయ్య జ్ఞానం” అన్న శీర్షిక
చూడగానే అలాగే అనిపించింది.
నిజానికి ఈ శీర్షిక రాసి… కింద సంబంధిత వ్యక్తి ఫోటో పెడితే చాలు..
అంత బలమైన శీర్షిక అది..

దూసుకొస్తున్న అస్త్రాన్ని అక్షరం మార్చకుండా తిరిగి
ప్రయోగించిన విలక్షణ వ్యూహమది.
నీవు నేర్పిన విద్యయే అని చెప్పకుండానే చెప్పిన చిలిపి
వెక్కిరింత అది.
మాటతూలితే దాన్నే మూటకట్టి అప్పజెప్పిన గడుసుతనమది.
మిగతా ఎడిటోరియల్ అంతా అదనమే..
శీర్షిక కొనసాగింపే.

నేనే..
ఆది మధ్యాంతరాలు నేనే..
భూనభోంతరాలూ నేనే..
పోరాడింది నేనే
సాధించింది నేనే..
తెచ్చేది నేనే
ఇచ్చేది నేనే
ఆలోచన నాదే..
ఆచరణా నాదే..
సకలం,
సర్వం నావే..
నేను చెప్పేదే సత్యం.. నిత్యం..
అధికారానికుండే ఈ అహంకారానికి ఎదురే లేదు.

ఉద్యోగులు మాట్లాడలేరు..
పార్టీ నేతలు ఎప్పుడూ పాదాక్రాంతులే…
ప్రజలకు వోటే .. మాట.
ఇక మిగిలింది మీడియా..
మీడియా అంటే ఎవరు..
మన గేటు దగ్గర పడిగాపులు కాసే “గొట్టాలోళ్లు”
మనం పదో పరకో ఇస్తే పండగ చేసుకునే బికారోళ్లు.
అలాంటి వాళ్ళు చెప్పింది నోరుమూసుకుని వినాలి.
అడిగితే.. ప్రతిపక్షాలను తిట్టించేలా అడగాలి.
అంతేకానీ, అధికారాన్ని ప్రశ్నిస్తే ..
పది మందిముందు పరువు తీస్తారు.
నిజాల కోసం నిలదీస్తే ..
నిలువునా గొయ్యితీసి కప్పేస్తామంటారు.
ఏడేళ్ళుగా సాగుతున్న ఈ ధోరణిని ఏకిపారేసింది… కే శ్రీనివాస్
ఎడిటోరియల్..

అది కూడా సుతిమెత్తగా, సున్నితంగా కాదు..
సమ్మెటపోటులాంటి వాక్యాలతో విరుచుకుపడ్డారు.
మొహమాటంగా, మర్యాదరామన్నలా కాదు..
ముక్కుసూటిగా మొహంమీద కుండబద్దలు కొట్టారు.
అటు అధికారవ్యవస్థల అహంకారాన్ని,
ఇటు నిస్సహాయ రిపోర్టర్ల అవమాన అవస్థలని..
తోటి మీడియా సోదరుల పెడధోరణులని వరసపెట్టి కడిగేసారు.

కే శ్రీనివాస్ సంపాదకీయానికి రేపు అధికార పత్రికలో పెద్ద
సమాధానమే రావచ్చు.
ఈలోగా సోషల్ మీడియాలో అప్పుడే అభిమానగణం
మొదలెట్టేసారు.

ఎక్కడ జర్నలిజమ్..
ఎక్కడ జర్నలిస్టులు..
అసలు ఆయన పత్రికకి జర్నలిజమ్ విలువలు వున్నాయా?
మీడియా అమ్ముడు పోవడం లేదా?
పాత్రికేయులు చేయిచాచడం లేదా?
ఏదో ఒక పక్షాన వార్తలు రాయడం లేదా?
ఇలాంటి ప్రశ్నలతో అసలు అంశాన్ని పక్కదారి పట్టించడానికి
ప్రయత్నాలు జరుగుతూనే వుంటాయి.

సమాజంలో అన్ని రంగాల్లో వున్న అవలక్షణాలు అంతో ఇంతో
మీడియాకు కూడా వుంటాయి.
నిజమే.. కానీ, ఇక్కడ సమస్య మీడియా పాతివ్రత్యం గురించి
కాదు..
ఎన్ని లోపాలున్నా.. మీడియా ఇప్పటికీ ప్రజాస్వామ్యానికి
నాలుగోస్తంభమే.. (మూడుకాళ్ళ మీద నిలబడడం కంటే నయమే కదా)

కనుక, మీడియా ప్రశ్నించాల్సిందే..
అధికారంలో వున్నవాళ్ళు .. అప్రశ్నలని సహించాల్సిదే..
సమాధానం చెప్పే కనీస సంస్కారాన్ని ప్రదర్శించాల్సిందే..
అలా లేనప్పుడు …మీడియా అడగాల్సిన ఏకైక ప్రశ్నే..
నీగ్గూడ ఉండాలె గదనయ్య జ్ఞానం..!

-శివ

Also Read:

వడ్లగింజలో బియ్యపుగింజ రాజకీయం

Also Read:

మంచి – చెడు

Also Read:

తమిళ తెరపై దళిత వసంతం

RELATED ARTICLES

Most Popular

న్యూస్