Sunday, March 3, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంతమిళ తెరపై దళిత వసంతం

తమిళ తెరపై దళిత వసంతం

Law on Reels & on Real

తమిళ సినిమా ఇప్పుడు ఒక దళిత మలుపు మీదుంది.
వెలివాడలు వెండితెరని మెరిపిస్తున్నాయి.
పా రంజిత్, వెట్రిమారన్, మారి సెల్వరాజ్, టీజీ జ్ఞానవేల్..
ఒకరికి మించి ఒకరు..

అంటరాని వసంతాలకు సెల్యులాయిడ్ గౌరవం ఇస్తున్నారు.
జై భీమ్..
ఈ వరుసలో తెరకెక్కిన మరో నిజజీవితం
కన్నీళ్లతో కౌగలించుకోవాల్సిన బాధాదృశ్యం.

ఊరవతల “దొంగకులాలు”
నరరూప “పోలీసులు”
చేయని నేరానికి కేసులు.
లాకప్ హింసలు,
లెక్కలోకి రాని ప్రాణాలు..
సమాజానికి పట్టని సమస్యలు..
సినిమాలో తప్పు పట్టడానికేం లేదు.

నిప్పులా బతుకుతున్న ఒక లాయర్/జడ్జి జీవిత కథే.
కానీ, ఈ సినిమాను మన సమాజం ఇంతగా ప్రేమించడమే
ఆశ్చర్యమేస్తుంది.
ఆశ్చర్యమెందుకో చెప్పే ముందు.. అసలు సినిమా కథ
చూడండి..

ఒక దొంగతనం కేసులో ముగ్గురుని “ఎత్తుకొస్తారు”
సమాజం దృష్టిలో వాళ్ళది అప్పటికే దొంగలకులం.
నేరంతో ఏ సంబంధం లేకపోయినా, (లేదని పోలీసులకుతెలిసినా)
దొంగతనం ఒప్పుకోమని చిత్రహింసలు పెడతారు.
కొట్టి కొట్టి ఒకడ్ని చంపేస్తారు.
మిగిలిన ఇద్దరినీ మళ్ళీ జైల్లో పడేస్తారు.

ఆ తర్వాత కథలో హీరో వస్తాడు. న్యాయం చేస్తాడు..
ఇక్కడ సినిమా చూసిన జనాన్ని కదిలిస్తున్నవేంటి?
కొన్ని కులాలని దొంగలుగా చూడడం.
వాళ్ళని పోలీసులు రాక్షసంగా హింసించడం..
మానవత్వం వున్న ఒక న్యాయవాది వాళ్ళతరపున పోరాడి గెలవడం.

అయితే, ఈ సినిమాను చూసి కదిలిపోతున్న జనం
నిజజీవితంలో ఇలాగే ఆలోచిస్తున్నారా?
ఇప్పుడు ఇదే కథని కొంచెం మార్చిచెప్పుకుందాం.

ఊరు చివర ఒక అత్యాచారం జరిగింది.
అమ్మాయిని చంపేసారు.
పోలీసులు మీడియా ముందు కొందరిని పెట్టి వీళ్ళే
నిందితులన్నారు.
పోలీసులు చెప్పడం తప్ప ఎలాంటి ఆధారాలూ లేవు.
వాళ్ళే నేరస్తులని కోర్టులో నిర్ధారణ జరగలేదు.

ఇప్పుడు జనం ఏం చేస్తారు?
ఆధారాలడుగుతారా?
నిజంగా వాళ్ళే నేరం చేసారని రుజువేంటంటారా?
వాళ్ళ కులం ఏంటి?
వాళ్ళ ఆర్ధిక బలం ఏంటి?
పోలీసులు చెప్పేమాటల్లో నిజమెంత?
అని ఆలోచిస్తారా?
ఇవీమీ వుండవు..

నేరం గురించి తెలియగానే జనం ఆవేశంతో ఊగిపోతారు.
పోలీసులు ఎవరిని నేరస్తులంటే.. వాళ్లని ఎన్ కౌంటర్ చేసేయమంటారు..
పోలీసులు కూడా వెంటనే ఈ డిమాండ్ ని అమలు చేస్తారు.
ఎన్కౌంటర్ చేసిన పోలీసుల్ని ఇదే జనం మళ్ళీ వేనోళ్ళా పొగుడుతారు.

ఈ ఎన్ కౌంటర్ లో “చచ్చినోడి” భార్యో .. తల్లో గుండెలవిశేలా ఏడుస్తుంది.
ఈ జనంలో ఎంత మంది స్పందిస్తారు?
పైగా అప్పటికే సామాజిక బాధ్యత నిండిన లాయర్లంతా
నిందితుడి తరపున వాదించకూడదని తీర్మానించేసుకుంటారు.

ఇది బూటకం ఎన్ కౌంటర్..
అసలు నిందితుల నేరం కోర్టుల్లో నిర్ధారణ కావాలి.
పోలీసుల ప్రెస్ మీట్లలో కాదు..
అని నూటికో కోటికో ఒకడు.. అన్నాడనుకోండి.
ఇదే జనం అతనికి కుహానా మేధావి అని బిరుదిస్తుంది.
మీ కూతురుకో, చెల్లికో అత్యాచారం జరిగితే ఇలాగే వాదిస్తావా
అని ప్రశ్నిస్తుంది.

సినిమాలో దొంగతనం కావచ్చు.. బయట అత్యాచారం కావచ్చు..
ఇక్కడ సమస్య .. నేరం కాదు..
నేరస్తుడిని నిర్ణయించే పద్ధతి.
చట్టంతో పనిలేకుండా వాడిని శిక్షించే సంస్కృతి.
సినిమా కథ 30 ఏళ్ళ వెనకటిది.

పరిస్థితుల్లో మాత్రం ఇప్పటికీ మార్పేం లేదు.
కులం లేనివాడు ..
డబ్బులేనివాడు …
కోర్టులు, పోలీసులతో పోరాడలేనివాడు..
దిక్కు మొక్కు లేనివాడెవడైనా..
ఈరోజుకీ చాలా తేలికగా నేరస్తుడైపోతాడు
అయితే, ఎన్కౌంటర్ అవుతాడు..
లేదా రైలుపట్టాలమీద శవమై కనిపిస్తాడు.

దీనికి కారణం.. కేవలం కిరాతక పోలీసులేకాదు.
చట్టం వద్దు..ఇన్స్ టంట్ న్యాయం ముద్దు
అని రోడ్డుమీదకొచ్చే జనమంతా కారణమే..
చందులాంటి న్యాయవాది రావాలి.
కులాలకు నేరముద్రపోవాలి…
అని అందరూ కోరుకుంటున్నారు..

కానీ, నిజజీవితంలో పోలీసులు చెప్పే కట్టుకథలు వినకూడదు..
న్యాయం.. కోర్టుల్లోనే జరగాలి..
నడిరోడ్డు మీదా.. రైలు పట్టాల మీదా కాదని అర్థం
చేసుకునేవాళ్ళు ఎంతమంది?
జై భీమ్ అయినా.. జనంలో ఈ మార్పు తీసుకువస్తుందా?

-శివ

Also Read:

న్యాయం జరిగిందా? …జరిపించారా?

Also Read:

ప్రభుత్వం- పోలీసు- మీడియా సమర్పణలో

Also Read:

హుజురాబాద్ చెప్పే పాఠం

Must Watch

RELATED ARTICLES

Most Popular

న్యూస్