Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

Huzurabad Result Is A Clear Warning For Power Mongers :

The clear lesson of Huzurabad result …..

గెల్లు శ్రీను,  కౌశిక్ రెడ్డి, హరీష్ రావు,  కేసిఆర్…ఎవరు కారణం?

సానుభూతి, తిరుగుబాటు, ప్రజావ్యతిరేకత… ఏది కారణం?

ఇంగ్లీషోడు అన్నట్టు ఓటమి అనాధే..
నాకు సంబంధం లేదని తప్పించుకునేవాళ్ళే అంతా.
మహా అయితే, ఏ హరీష్ రావునో బాధ్యుడిని చేయొచ్చు.
లేదా తనదే బాధ్యత అని అతనే ఒప్పుకోవచ్చు.
కానీ నిజంగా ఓటమికి కారణమెవరు?
బాధ్యత ఎవరిది?

హుజూరాబాద్ ఓటమికి టీఆర్ఎస్ నేతలు చెప్తున్న చెప్పగలిగిన కారణాల్లో కొన్ని :

– ఈటల రాజేందర్ స్థాయి ముందు గెల్లుశ్రీను సరిపోలేదు.
రాజేందర్ సెంటిమెంట్ డ్రామా వర్కౌట్ అయింది.
– ఈటలని ఇప్పటికీ నియోజకవర్గప్రజలు తమ వాడిగానే చూస్తున్నారు.
– క్షేత్ర స్థాయిలో టీ ఆర్ ఎస్ కేడర్ ఇంకా రాజేందర్ తో వుంది.
– అధినాయకత్వం భయానికి సర్పంచ్ లు, ఎంపిటిసిలు రాజేందర్ కి దూరంగా వున్నట్టు నటించినా.. లోపాయికారి ప్రచారం మాత్రం అటే వేసారు.
– రాజేందర్  పేరుకి బిజెపిలో చేరినా హిందుత్వ ఎజెండా ఎత్తుకోకపోవడం వల్ల, ముస్లిమ్, దళితుల వోట్లు దూరం కాలేదు.
అన్నిటికీ మించి రేవంత్ రెడ్డి, “రాజేందర్ రెడ్డి ” ఒక్కటయ్యారు. రెడ్డి సామాజికవర్గం వోట్లన్నీ గంపగుత్తగా పడ్డాయి.


– కాంగ్రెస్ పార్టీ వోట్లు ఎక్కువగా రాజేందర్ కు మళ్లాయి.
– బిసిలకు టిఆర్ఎస్ అన్యాయం చేస్తోందన్న వాదన జనంలోకి బాగా వెళ్లింది..
– టిఆర్ఎస్ ద్వితీయ శ్రేణి నాయకత్వంలో ఒక వర్గం ఎలాగూ రాజేందర్ గెలుస్తాడని ఉదాసీనంగా వుంది.
– ఇంకోవర్గంలో దళితబంధు గెలిపిస్తుందన్న ధీమా ఎక్కువైంది.
– టీఆర్ఎస్ వేలకు వేలు డబ్బుపంచుతుందన్న ప్రచారం ఎక్కువవడంతో ఆ డబ్బు చేరని జనం అంతా టిఆర్ఎస్ కు దూరమయ్యారు.

ఇలా ఎన్నైనా చెప్పొచ్చు.

ఇందులో కొన్ని నిజం కావచ్చు.
లేదా అన్నీ నిజమే కావచ్చు.
కానీ, వీటన్నిటినీ జయించే శక్తి కేసిఆర్ లో లేదా?
అయినా టిఆర్ఎస్ ఎందుకు ఇంత ఘోరంగా ఓడిపోయింది?
దానికి టిఆర్ఎస్ నేతలు ఒప్పుకోడానికి ఇష్టపడని  అసలు కారణం ఒకటుంది.
అదే ప్రజలకి వుండే అహం…
ప్రభుత్వాలు తమని టేకెన్ ఫర్ గ్రాంటెడ్ గా తీసుకోడాన్నిసహించలేని ఆగ్రహం.

Etela Rajender in BJP

రాజేందర్ లో ఎప్పుడూ గెలుపు తనదేనన్న ధీమా కనపడలేదు.
తాము ఓడిపోవచ్చేమో అన్న అనుమానం కూడా ఎప్పుడూ టిఆర్ఎస్ లో కనిపించలేదు.
తానొక బాధితుడినని రాజేందర్ చెప్పుకున్నారు.
తానొక చాంపియన్ అని చెప్పుకున్నారు..కేసిఆర్.
నన్ను మీరే కాపాడుకోవాలన్నారు రాజేందర్..
మిమ్మల్ని కాపాడేది నేనే అని ప్రకటించింది.. టిఆర్ఎస్..
ప్రజల విచక్షణే తనని గెలిపించాలని ఆశించాడు.. రాజేందర్.
అసలు ప్రజలకి విచక్షణంటూ ఏముండదని బలంగా నమ్మాడు.. కేసిఆర్.
తన మాటల మంత్రాల ముందు జనం ఆలోచన ఏమాత్రం పనిచేయదని కేసిఆర్ నమ్మకం.
ఈ నమ్మకంతోనే రాత్రికి రాత్రి రాజేందర్ ని పార్టీనుంచి తరిమేసాడు.
ఆ నమ్మకంతోనే దళిత భూముల ఆక్రమణ అంటూ
మీడియాలో అడ్డగోలు కథనాలు రాయించాడు.
ఈ నమ్మకంతోనే దళిత బంధు లాంటి పథకాలు తెచ్చాడు.
తాను ఎవరిని నిలబెడ్తే వాడే నాయకుడని కేసిఆర్ ఊహించుకున్నాడు.
అందుకే గెల్లుశ్రీనుని అభ్యర్థిగా తెరపైకి తెచ్చాడు.
జనం ముందు డబ్బుకి మించిన ఆకర్షణేదీ వుండదు.
ఇంటికి పదిలక్షలు పడేస్తే తన మన అనుబంధాలేం పనిచేయవు.
వోటుకు పదివేలిస్తే, మంచి– చెడు తేడాలేం వుండవు.
ఇవీ కేసిఆర్ కి వుండే అభిప్రాయాలు..అతివిశ్వాసాలు.
అధికారం తలకెక్కిన నేతలకు ఇలాంటి అహంకారం సహజమే.
ప్రజాఉద్యమం నుంచి నేతగా ఎదిగిన కేసిఆర్ కి కూడా వుండడమే ఆశ్చర్యం.
ఈ అహంకారాన్ని హుజూరాబాద్ జనం ఈసారి సహించలేదు.

తమకూ ఆలోచన వుందని,
తమకూ మంచి చెడు తెలుసని,
ఇంటికి పదిలక్షలతోగానీ, వోటుకి పదివేలతోగానీ తమని
కొనలేరని జనం నిరూపించారు.

ఇక్కడ రాజేందర్ మచ్చలేని, అంటని వజ్రమని కాదు.
కేసిఆర్ కి ప్రజల నాడి అస్సలు తెలియదనీ  కాదు.
ఈ ఒక్క ఓటమితో టీఆర్ఎస్ పని అయిపోయిందనే భ్రమలూ వుండక్కర్లేదు.
కాకపోతే, జనం సొమ్ముతోనే జనాన్ని కొనేయొచ్చన్న అహంకారం అప్పుడప్పుడైనా  ఓడిపోవడం ప్రజాస్వామ్యానికి మంచిదే.   

Must Read : టీఆర్ఎస్ అంతానికి ఆఖరి పోరాటం

-శైలి

Leave a Reply

Your email address will not be published.

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com