7.1 C
New York
Saturday, December 2, 2023

Buy now

Home'ఐ'ధాత్రి ప్రత్యేకంప్రజాస్వామ్య ప్రథమా విభక్తి!

ప్రజాస్వామ్య ప్రథమా విభక్తి!

Vote-Lost:  ఓటు, నోటు రెండూ ఇంగ్లీషు మాటలే. Vote, note మాటలకు ప్రథమావిభక్తి సూత్రం డు ము వు లు లో ‘ఉ’ చేరి ఓటు, నోటు అయ్యాయి. బహువచనంలో ‘లు’ చేరి ఓట్లు, నోట్లు అయ్యాయి. “ఓటుకు నోటు” అన్నది జగమెరిగిన పదబంధం. ఓ నో లో అచ్చుగా ఉన్న ఓ; హల్లుగా ఉన్న టు ప్రాస మైత్రి కూడా చక్కగా కుదరడం కాకతాళీయం కాదు. లిటరల్ జస్టిఫికేషన్!

మాటలకు విభక్తి ప్రత్యయాలు లేకుంటే పేర్చని ఇటుకల్లా విడి విడిగా పడి ఉంటాయి. సిమెంటు, ఇసుక, నీళ్లు తగిన పాళ్లల్లో కలిపి ఆ మిశ్రమాన్ని ఇటుకల మధ్య ఒడుపుగా వేసుకుంటూ ఒక్కో ఇటుకను పేర్చుకుంటూ…భవనాన్ని కట్టినట్లు…మాటలకు విభక్తి ప్రత్యయాల మిశ్రమాన్ని తగినట్లు తగిలిస్తూ భావ సౌధాన్ని నిర్మించాలి. వ్యాకరణం తెలిసినా…తెలియకపోయినా…విభక్తి ప్రత్యయాలు లేకపోతే పదాలన్నీ తెగిన గాలి పటాలై వాక్యానికి, అర్థానికి, భావానికి దొరక్క అనంత ఆకాశంలో పిచ్చి పట్టి తిరుగుతూ ఉంటాయి.

పదాలకు పరస్పర సంబంధం కలిగించేవి విభక్తులు.
ఆ విభక్తులను తెలిపేవి ప్రత్యయాలు.

ఇది అంటరాని తెలుగు వ్యాకరణ పాఠం అనుకుని చదవడం ఆపేయకండి. ఇవి అక్షరాలా ప్రజాస్వామ్య విభక్తి ప్రత్యయ సూత్రాలు.

భాషలో విభక్తి ప్రత్యయాలు తెలియకపోయినా వాటిని మనం గౌరవించి, స్వీకరించి, ఆచరణలో పొల్లు పోకుండా…అలాగే మాట్లాడతాం. రాస్తాం.

ప్రజాస్వామ్యంలో కూడా అంతే. ఎంత గొప్ప ప్రజాస్వామిక భావన అయినా అది కంటికి కనిపించని, చేతి స్పర్శకు తగలని అమూర్తమయిన భావన కాదు కదా! ఆ భావం భాషలోకి అనువాదమయినప్పుడు దానిక్కూడా మామూలు భాషా సూత్రాలే అన్వయమవుతాయి.

ప్రథమా విభక్తి-
డు, ము, వు, లు:- ఓం ప్రథమంగా తెలుగులో ఓటు అంటే ప్రామాణిక నిఘంటువు శబ్ద రత్నాకరం ప్రకారం- ఓటమి, భంగం, చీలిక. ఓటి కుండలో నీరు నిలువదు అని మనం వాడుతున్న ‘ఓటి’లో ఉన్నది తెలుగు ఓటు- అంటే పగిలిన, చీలిన, చిల్లు పడ్డ అని.

తెలుగును ఓడించి ఇంగ్లీషును రెండు వందల యాభై ఏళ్లుగా గెలిపిస్తున్నాం కాబట్టి ఎన్నికల్లో తెలుగు ‘ఓటు’ తెరమరుగై ఇంగ్లీషు ‘ఓటు’ ఆటోమేటిగ్గా ముందుకొస్తుంది కాబట్టి…ఇప్పుడు ఓటంటే ఎన్నికల ఓటే. ఇంగ్లీషు ఓటుకు తెలుగులో ఓటమి, చీలిక, చిల్లుపడడం అనే అర్థం తీసుకోకూడదు. తెలుగువారు ఓటు వేసినా…అది ఇంగ్లీషు ఓటు అర్థం అయితేనే ప్రజాస్వామ్యం బతికి గోచీ అయినా కట్టుకోగలుగుతుంది. తెలుగు అర్థమయితే వెయ్యకముందే ఓటు ఓటమిని ప్రతిపదార్థ టీకాసహితంగా అక్షరాలా అంగీకరిస్తుంది. అప్పుడు ఓటు ఓడిపోవాలే కానీ…గెలవడానికి ఆస్కారం ఉండదు. ఇదంతా చాలా గంభీరమయిన, సంక్లిష్టమయిన వ్యవహారమై…ప్రజాస్వామ్యం తెలుగు అర్థాన్వయంలో ఓడిపోవాల్సి వస్తుంది.

అందువల్ల ఇంగ్లీష్ voteకు చివర ప్రథమావిభక్తి ‘ఉ’ తగిలించి ఓటు/వోటు చేసుకుని ప్రజాస్వామ్యాన్ని బతికించుకోవడమే ఉత్తమ మార్గం.

ద్వితీయ విభక్తి-
నిన్, నున్, లన్, కూర్చి, గురించి:- ఒకరి ఓటును ఇంకొకరు వేయకూడదు అన్నది రూల్. ఆచరణలో ఇది డిబేటబుల్. కొన్ని ఓట్లను కూర్చి ఒక విలువ నిర్ణయించడం పరిపాటి. ఓటు వేసేంతవరకు ఓటర్ల గురించి ధ్యాస; వేసిన తరువాత కుర్చీ గురించిన ధ్యాస సహజం.

తృతీయ విభక్తి
చేతన్, చేన్, తోడన్, తోన్:- ప్రజల చేత, ప్రజల తోడ, ప్రజలతోన్ ప్రభుత్వం ఏర్పడే మాట నిజమే. ఓటు వేసిన తరువాత ప్రజలు సేవకులు, గెలిచినవారు పాలకులు అవుతారు.

చతుర్ధీ విభక్తి
కొఱకున్, కై:- ప్రజల కొరకు, కై ప్రభుత్వం అని మనం అనుకోవడానికి ఎంత అధికారం ఉంటుందో…తమ కొరకు, కై, కొరకే అని అనుకునే అధికారం ఎన్నికయిన ప్రజా ప్రతినిధులకు కూడా అంతే ఉంటుంది.

పంచమి విభక్తి-
వలనన్, కంటెన్, పట్టి:- ప్రజల వలన ప్రభుత్వాలు ఏర్పడతాయి. కానీ ప్రజాప్రభుత్వంలో ప్రజలు గెలిపించిన ప్రతినిధులు ప్రజలకంటే బలమయినవారు అవుతారు. కొందరు ఓటేసి గెలిపించిన పాపానికి ప్రజలను పట్టి పీడించవచ్చు కూడా.

షష్టీ విభక్తి-
కిన్, కున్, యొక్క, లోన్, లోపలన్:- ఓటుకు ఓటుకు నోటు మారుతూ ఉండవచ్చు. అది ఓటు యొక్క విలువను బట్టి ఆధారపడి ఉంటుంది. బ్యాలెట్ బాక్స్ లోపల పడేవరకు విలువల్లో ఎక్కువ తక్కువలు సహజం.

సప్తమీ విభక్తి-
అందున్, నన్:- ఓటు వేసినట్లు వేలి మీద చుక్క వేస్తారు. ఓటు వేయించుకోవడానికి అభ్యర్థులు ‘చుక్కలు’ పోస్తారు. అభ్యర్థి చుక్కనందు ఓటు చుక్క మునిగి తేలి ఊగుతుందా? ఓటు చుక్కే అభ్యర్థి చుక్కలనన్ వెతుకుతూ వెళుతుందా? అనేది ఎవరికి వారు పరిశీలించి తేల్చుకోవాల్సిన విషయం.

సంబోధన ప్రథమా విభక్తి-
ఓ, ఓరీ, ఓయీ, ఓసీ:- ఓటు వేసే వరకు- అయ్యా! అమ్మా! అవ్వా! తాతా! అత్తా! మామా! బాబూ! అక్కా! అన్నా! తమ్మీ!

ఓటు వేసిన తరువాత-
ఓ! ఓరీ! ఓయీ! ఓసీ! నీ…!!

-పమిడికాల్వ మధుసూదన్

Also Read :

మునుగోడులో మునిగేది ఎవరు?

RELATED ARTICLES

Most Popular

న్యూస్