మూడు ఈశాన్య రాష్ట్రాలకు ఎన్నికల నగారా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం ఈ రోజు షెడ్యూల్ ప్రకటించింది. బుధవారం మధ్యాహ్నం 2.30 గంటలకు మీడియా సమావేశంలో నాగాలాండ్, మేఘాలయ, త్రిపుర అసెంబ్లీ ఎన్నికల తేదీలను అధికారులు వెల్లడించారు. ఫిబ్రవరి 16వ తేదిన త్రిపుర ఎన్నికలు కాగా ఫిబ్రవరి 27వ తేదిన ఒకే రోజు నాగాలాండ్, మేఘాలయ రాష్ట్రాల ఎన్నికలు జరగనున్నాయి.
త్రిపుర ఎన్నికల తేదీలు
జనవరి 21వ తేదిన నోటిఫికేషన్ విడుదల అవుతుంది. ఆ రోజు నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు.
జనవరి 30వ తేది వరకు నామినేషన్లు స్వీకరిస్తారు.
జనవరి 31నామినేషన్ల పరిశీలన, ఫిబ్రవరి రెండో తేది నామినేషన్ల ఉపసంహరణకు ఆఖరు రోజు
ఫిబ్రవరి 16వ తేదిన పోలింగ్…మార్చి 2న ఎన్నికల ఫలితాలు వెలువడతాయి.
నాగాలాండ్, మేఘాలయ ఎన్నికల తేదీలు
జనవరి 31వ తేదిన నోటిఫికేషన్ విడుదల అవుతుంది. ఆ రోజు నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు.
ఫిబ్రవరి 07వ తేది వరకు నామినేషన్లు స్వీకరిస్తారు.
ఫిబ్రవరి 08 నామినేషన్ల పరిశీలన, ఫిబ్రవరి 10వ తేది నామినేషన్ల ఉపసంహరణకు ఆఖరు రోజు
ఫిబ్రవరి 27వ తేదిన పోలింగ్…మార్చి 2న ఎన్నికల ఫలితాలు వెలువడతాయి.
ఈ మూడు రాష్ట్రాల ప్రస్తుత శాసనసభల పదవీకాలం మార్చితో ముగియనుంది. ఈ నేపథ్యంలో జనవరి 11వ తేదీన కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్‌కుమార్ నేతృత్వంలోని ఈసీ బృందం ఈ మూడు రాష్ట్రాల్లో పర్యటించింది. వరుస సమావేశాలు నిర్వహించింది. ఎన్నికలపై ఆయా రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీలు, స్థానిక యంత్రాంగం, పోలీసు సిబ్బంది అభిప్రాయాలు తీసుకుంది.