ఓటర్ల జాబితాలో పేరు లేని వారు ఓటరుగా నమోదు చేసుకోవడానికి ఎన్నికల సంఘం మరోసారి అవకాశం కల్పించింది. ఓటర్ల జాబితా సవరణను తేదీలను ప్రకటించింది. ముసాయిదా జాబితాను ఆగస్టు 21న ప్రకటించనుంది. అదే రోజు నుంచి సెప్టెంబర్ 19 వరకు జాబితాలో పేర్లు చేర్చుకోవడానికి, మార్పులు చేర్పులు చేసుకోవడానికి అవకాశం కల్పించింది. సెప్టెంబర్ 28 నుంచి అభ్యంతరాలు, దరఖాస్తులను పరిశీలించనున్నారు. అక్టోబర్ 4న తుది ఓటరు జాబితాను ప్రకటించనున్నారు. ఇదే జాబితాతో తెలంగాణలో సాధారణ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొత్త ఓటర్ల నమోదు, సవరణలు, మార్పులు చేర్పులు ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుందని తెలుస్తుంది. 2023 అక్టోబర్ ఒకటి నాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు నమోదుకు చేసుకునేందుకు అవకాశం ఉంది.
518 మంది నియోజకవర్గ స్థాయి మాస్టర్ ట్రైనర్లకు శిక్షణ
సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం బూత్ స్థాయి అధికారుల (బీఎల్‌ఓ)కు శిక్షణ ఇవ్వడానికి అవసరమైన నియోజకవర్గ స్థాయి 518 మంది నియోజకవర్గ స్థాయి మాస్టర్ ట్రైనర్లకు శిక్షణ పూర్తి చేసింది ఎన్నికల సంఘం. రాష్ట్రంలో 34,891 బూత్‌లు ఉన్నాయి. వీటికి అవసరమైన సిబ్బందికి శిక్షణ ఇవ్వడానికి మాస్టర్ ట్రైనర్లకు శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని ఈనెల 15 నుంచి ప్రారంభించారు. ఈ శిక్షణలో భాగంగా 80 మంది జిల్లా స్థాయి మాస్టర్ ట్రెనర్లకు శిక్షణ ఇచ్చారు. జిల్లా స్థాయి మాస్టర్ ట్రైనర్‌లు 518 మంది నియోజకవర్గ స్థాయి మాస్టర్ ట్రెనర్లు శిక్షణ ఇచ్చారు. శిక్షణ జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి, ఈఆర్‌వోలు, అసిస్టెంట్ ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్లు హాజరయ్యారు. త్వరలో మండల, మున్సిపాలిటీ స్థాయిలో బూత్ స్థాయి అధికారులకు శిక్షణ ఇవ్వనున్నారు.