Tuesday, May 6, 2025
HomeTrending Newsచత్తీస్ ఘడ్ లో భారీ ఎన్‌కౌంటర్‌... ఆరుగురు మావోల మృతి

చత్తీస్ ఘడ్ లో భారీ ఎన్‌కౌంటర్‌… ఆరుగురు మావోల మృతి

దేశమంతా ఎన్నికల కోలాహాలం కొనసాగుతుంటే మధ్య భారత దేశంలో పోలీసు బలగాలు – మావోయిస్టుల మధ్య యుద్ధం జరుగుతోంది. వేసవి కాలం కావటంతో అడవులు పలచగా ఉండటం… తాగునీటి కొరతతో మావోలు షెల్టర్ ప్రాంతాలకు తరలుతున్నారు. ఇదే అదునుగా మావోల ఏరివేత చురుకుగా సాగుతోంది.

ఛత్తీస్‌గఢ్‌ లోని బీజాపూర్‌ జిల్లాలో ఈ రోజు (బుధవారం) ఉదయం భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. బాసగూడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని చీపురుబట్టి – పుస్బాక అటవీ ప్రాంతంలో కూంబింగ్‌ నిర్వహిస్తున్న భద్రతాబలగాలకు, మావోయిస్టులు తారసపడ్డారు. భద్రతాబలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతిచెందారు. మృతుల్లో దళం డిప్యూటీ కమాండర్‌తోపాటు ఒక మహిళ ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

భద్రతాబలగాలు, పోలీసులకు మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. కోబ్రా 210, 205, CRPF 229 బెటాలియన్, DRG జవాన్లు మావోయిస్టులతో పోరాడుతున్న భద్రతా దళాల్లో ఉన్నారు. మరణించిన నక్సలైట్ల మృతదేహాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. హోలీ రోజు నక్సలైట్లు ఈ ప్రాంతంలో ముగ్గురు గ్రామస్థులను ఇన్ఫార్మర్ల నెపంతో చంపారు.

సరిగ్గా నెల రోజుల క్రితం ఫిబ్రవరి 27న ఇదే బీజాపూర్‌ జిల్లా చోటే తుంగాలి అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పుల్లో నలుగురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు.

అటవీ ప్రాంతంలో డిస్ట్రిక్ట్‌ రిజర్వ్‌ గార్డ్స్‌, సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు ఆపరేషన్‌ చేపట్టారు. ఘటనాస్థలం నుంచి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. అప్పటి నుంచి ఆ ప్రాంతంలో గాలింపు కొనసాగుతోంది. మావోలు సరిహద్దులు దాటకుండా చత్తీస్ గడ్, మహారాష్ట్ర అటవీ ప్రాంతాల్లో కేంద్ర పోలీసు బలగాలు విస్తృతంగా కూంబింగ్ నిర్వహిస్తున్నాయి.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్