హిందూ ధర్మ పరిరక్షణే లక్ష్యంగా ఏడు ప్రముఖ దేవాలయాల ద్వారా పెద్ద ఎత్తున ధర్మ ప్రచార కార్యకమాన్ని చేపట్టనున్నట్టు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి (దేవాదాయశాఖ) కొట్టు సత్యనారాయణ వెల్లడించారు. మంగళవారం సచివాలయంలో ఏపీ ధార్మిక పరిషత్ కమిటీ 3వ సమావేశం ఆయన అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వివిధ దేవాలయాల్లో రోజువారీ జరగాల్సిన నిత్య పూజా కార్యక్రమాలన్నీ సక్రమంగా జరగాలని ఆవిషయంలో ఎలాంటి లోటుపాట్లకు ఆస్కారం లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి పైనా ఉందని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ఏడు ప్రముఖ దేవాలయాలు సింహాచలం, అన్నవరం, ద్వారకా తిరుమల, విజయవాడ కనకదుర్గ, శ్రీశైలం,శ్రీకాళహస్తి, కాణిపాకం ప్రచార రధాల ద్వారా ఈ కార్యక్రమాన్ని చేపడు తున్నట్టు చెప్పారు.

ప్రజల్లో హిందూ ధర్మ పరిరక్షణే ప్రధాన లక్ష్యంగా ప్రజల్లో ఆధ్యాత్మిక భావాలను, నైతిక విలువలను పెంపొందించడం, కుటుంబ వ్యవస్థ ప్రాముఖ్యతను చాటి చెప్పడమే లక్ష్యమని స్పష్టం చేశారు. అదే విధంగా సనాతన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన అంశం పైన పురాణ ఇతిహాసాలకు సంబంధించి చిన్న చిన్న పుస్తకాలను ప్రచురించి ప్రజలకు పంపిణీ చేయడం ద్వారా వారిలో హిందూ ధర్మ పరిరక్షణపై అవగాహన పెంపొందుతుందని తెలిపారు.

ఈప్రచార రధాలు ఆయా గ్రామాలు,పట్టణాల సందర్శనకు సంబంధించిన తేదీలు, సమయాలు ముందుగానే తెలియజేసి వివిధ దేవాలయాలు,ఆధ్యాత్మిక సంస్థలు,ఆధ్యాత్మిక వేత్తలను ఈకార్యక్రమంలో భాగస్వాములను చేసి ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనేలా చూడాలని ఉప ముఖ్యమంత్రి సత్యనారాయణ అధికారులకు సూచించారు.అంతేగాక ప్రతి ప్రచార రధానికి ఒక బృందాన్ని ఏర్పాటు చేసి వారి ద్వారా ఈ ధర్మ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించారు. రాష్ట్ర శ్రేయోభివృద్ధే లక్ష్యంగా అనగా సంపద,రక్షణ,శక్తి పెంపొందాలనే ఆశయంతో విజయవాడలో లక్ష్మీ సుదర్శన రాజ శ్యామల సుదర్శన సహిత మహాలక్ష్మీ యజ్ణాన్ని నిర్వహించాలని సంకల్పించామని ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ వెల్లడించారు. ఇందుకు సంబంధించి ఈసమావేశంలో పాల్గొన్న ఆగమ మరియు జ్యోతిష్య పండితుల నుండి పలు సూచనలు,సలహాలను స్వీకరించారు. అదే విధంగా వీడియా లింక్ ద్వారా పెద్ద జియంగార్ పీఠాధిపతి, పుష్పగిరి పీఠాధిపతి తోపాటు టిటిడి ఇఓ ధర్మారెడ్డి పాల్గొని ఈయజ్ణం నిర్వహణకు సంబంధించి పలు సూచనలు సలహాలు అందించారు. ఈయజ్ణం నిర్వహణకు సంబంధించిన తేది,ముహూర్తం తదితర ఏర్పాట్లపై దేవాదాయశాఖతో పాటు సంబంధిత శాఖల సమన్వయం తో తగిన చర్యలు తీసుకోవాల్సి ఉందని ఉప ముఖ్యమంత్రి చెప్పారు.

ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజయ్ కల్లాం, దేవాదాయశాఖ కమీషనర్ మరియు కార్యదర్శి హరి జవహర్ లాల్, అదనపు కమీషనర్ రామచంద్ర మోహన్,రీజనల్ జాయింట్ కమీషనర్లు ఆజాద్,భ్రమరాంబ, రాణా ప్రతాప్,సురేశ్ బాబు, సాగర్ బాబు, త్రినాధరావు, చంద్ర శేఖర్ రెడ్డి,డిప్యూటీ కమీషనర్ విజయరాజు,స్టేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ రామచంద్ర రావు,ఆగమ పండితులు చక్రవర్తి,ఇంకా పలువురు ఆగమ పండితులు,ఆగమ సలహాదార్లు,ధార్మిక పరిషత్ సభ్యులు,అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *