ఇండియా-ఇంగ్లాండ్ మధ్య ఓవల్ స్టేడియంలో జరుగుతోన్న నాలుగో టెస్ట్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్ లో 290 పరుగులకు ఆలౌట్ అయ్యింది. మూడు వికెట్లకు 53 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో నేడు ఆట ప్రారంభించిన ఇంగ్లాండ్ మొదటి సెషన్ లో వెంటవెంటనే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తర్వాత వికెట్ కీపర్ బెయిర్ స్టో, ఓలీ పొప్ లు ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యత తీసుకున్నారు. ఆరో వికెట్ కు 89 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 37 పరుగులు చేసిన బెయిర్ స్టో సిరాజ్ బౌలింగ్ లో ఎల్బీగా వెనుదిరిగాడు. తర్వాత మొయిన్ అలీ – ఓలిలు ఏడో వికెట్ కు 71 పరుగులతో మరో పటిష్ట భాగస్వామ్యం నమోదు చేశారు. 81 పరుగులు చేసిన ఓలీ, శార్దూల్ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన క్రిష్ ఓక్స్ 60 బంతుల్లోనే 11 ఫోర్లతో అర్ధసెంచరీ నమోదు చేసి భారత బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఓక్స్ రనౌట్ గా వెనుదిరగడంతో 290 పరుగుల వద్ద ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్ కు తెరపడింది. ఇండియాపై 99 పరుగుల ఆధిక్యం సంపాదించింది.
భారత బౌలర్లలో ఉమేష్ యాదవ్ -౩, బుమ్రా -2, జడేజా-2 వికెట్లు తీసుకున్నారు. సిరాజ్, శార్దూల్ ఠాకూర్ లకు చెరో వికెట్ దక్కింది. ఆ తర్వాత రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ ఇండియా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించారు. రెండోరోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 43 పరుగులు చేయగలిగింది.