ఇండియా-ఇంగ్లాండ్ మధ్య ఆగస్ట్ 25 నుంచి ప్రారంభం కానున్న మూడో టెస్టు మ్యాచ్ కు ఇంగ్లాండ్ పేస్ బౌలర్ మార్క్ వుడ్ దూరమయ్యాడు. ఎడమ భుజానికి అయన గాయం కారణంగా వుడ్ మూడో టెస్టు ఆడబోవడం లేదని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు అధికారి స్పష్టం చేశారు లార్డ్స్ లో జరిగిన రెండో టెస్టులో మార్క్ వుడ్ మొదటి ఇన్నింగ్స్ లో రెండు, రెండో ఇన్నింగ్స్ లో మూడు వికెట్లు పడగొట్టి రాణించారు. అయితే మ్యాచ్ నాలుగోరోజున భుజం నొప్పి కారణంగా ఆట మధ్యలోనే వెనుదిరిగాడు. లీడ్స్ లో జరిగే మూడో టెస్టుకు వుడ్ అందుబాటులో లేకపోయినా జట్టుతోనే ఉంటాడని మూడో టెస్టు ముగిసే సమయానికి వుడ్ భుజం నొప్పిపై మరోసారి అంచనా వేసుకొని నాలుగో టెస్టులో అతణ్ణి ఆడించాలా లేదా అనేది నిర్ణయిస్తామని ఇంగ్లాండ్ బోర్డు అధికారి వివరించారు.
ట్రెంట్ బ్రిడ్జి లో జరిగిన మొదటి టెస్ట్ డ్రా గా ముగిసిన సంగతి తెలిసిందే. ఆగస్టు 12 నుంచి 16 వరకూ లార్డ్స్ లో జరిగిన రెండో టెస్టులో ఇండియా చారిత్రాత్మకమైన విజయాన్ని నమోదు చేసుకుంది. 60 ఓవర్లలో 272 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ 120 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఇండియా 151 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఐదు టెస్టుల సిరీస్ లో ఇండియా ప్రస్తుతం 1-0 ఆధిక్యంతో కొనసాగుతోంది.