England in finals: ఐసిసి మహిళా వరల్డ్ కప్ ఫైనల్స్ లో మరో యాషెస్ పోరు జరగనుంది. ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియాతో ఇంగ్లాండ్ తలపడనుంది. నేడు జరిగిన రెండో సెమీఫైనల్ మ్యాచ్ లో సౌతాఫ్రికాపై ఇంగ్లాండ్ 137 పరుగుల భారీ విజయం సాధించి టైటిల్ పోరుకు సిద్ధమైంది. ఇంగ్లాండ్ బౌలర్ సోఫీ ఎక్సెల్ స్టోన్ ఆరు వికెట్లు తీసుకొని సౌతాఫ్రికాను దెబ్బతీసింది.
క్రైస్ట్ చర్చ్ లోని హేగ్లీ ఓవల్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్ లో సౌతాఫ్రికా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఇంగ్లాండ్ ఏడు పరుగుల వద్ద తొలి వికెట్ (బ్యూమోంట్-7) కోల్పోయింది. కెప్టెన్ హైదర్ నైట్ (1) నిరాశపరచగా, స్కైవర్-15; అమీ జోన్స్-28 పరుగులు చేసి ఔటయ్యారు. ఓ వైపు మిగతా బ్యాట్స్ విమెన్ ఔటవుతున్నా ఓపెనర్ వ్యాట్ క్రీజులో నిలదొక్కుకుని రాణించి, డంక్లీతో కలిసి ఐదో వికెట్లు 116 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది, 125 బంతుల్లో 12 ఫోర్లతో 129 పరుగులు చేసిన వ్యాట్ ఐదో వికెట్ గా ఔటైంది. డంక్లీ 60 పరుగులు చేయగా…. చివర్లో ఎక్సెల్ స్టోన్ 11 బంతుల్లో 5 ఫోర్లతో 24 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 293 పరుగులు చేసింది. ప్రోటీస్ మహిళల జట్టులో ఇస్మాయిల్ మూడు; కాప్, మసబాట క్లాప్ చెరో రెండు, ఆయబొంగా ఖాక ఒక వికెట్ పడగొట్టారు.
లీగ్ మ్యాచ్ లలో సత్తా చాటిన సౌతాఫ్రికా మహిళలు ఈ మ్యాచ్ లో మాత్రం స్థాయికి తగ్గ ఆట ప్రదర్శించలేక పోయారు. జట్టు స్కోరు ఒకటి వద్ద తొలి, 8 వద్ద రెండో వికెట్ కోల్పోయారు. ఆ తర్వాత కూడా వరుస వికెట్లు కోల్పోతూ వచ్చారు. జట్టులో మిగ్నాన్ డూప్రేజ్-30; లారా గూడాల్-28; సూనే లూస్, మరిజన్నే కాప్, త్రిష చెట్టి తలా 21 పరుగులతో రాణించారు. ఎక్సెల్ స్టోన్-6; శ్రుభ్ సోల్ 2; కాటే క్రాస్, డీన్ చెరో వికెట్ పడగొట్టారు, 38 ఓవర్లలో 156 పరుగులకే సౌతాఫ్రికా ఆలౌట్ అయ్యింది.
129 పరుగులు చేసిన డేనియేలే వ్యాట్ కు ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ దక్కింది.
Also Read : మహిళల వరల్డ్ కప్: ఫైనల్లో ఆసీస్