Captain Innings:
తొలి ఇన్నింగ్స్ లో తక్కువ స్కోరుకే ఔటైన ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ లో నిలకడగా రాణిస్తోంది. కెప్టెన్ జో రూట్-86; డేవిడ్ మలాన్- 80 పరుగులతో అజేయంగా ఉన్నారు. యాషెస్ సిరీస్ లో భాగంగా బ్రిస్బేన్ లోని గబ్బా స్టేడియంలో జరుగుతోన్న మొదటి టెస్ట్ లో నిన్న రెండో రోజు ఏడు వికెట్లకు 343 పరుగులు చేసిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 425 పరుగులకు ఆలౌట్ అయ్యింది. నిన్న సెంచరీ (112) చేసి నాటౌట్ గా ఉన్న హెడ్ 152 పరుగులు చేసి ఔటయ్యాడు. స్టార్క్-35, లియోన్ 15 పరుగులు చేశారు. ఇంగ్లాండ్ బౌలర్లలో ఓలీ రాబిన్సన్, మార్క్ వుడ్ చెరో మూడు, క్రిస్ ఓక్స్ రెండు, జాక్ లీచ్, జో రూట్ చెరో వికెట్ పడగొట్టారు.
278 పరుగులు వెనకబడి రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లాండ్ 23 పరుగుల వద్ద ఓపెనర్ రోరి బర్న్స్(13) వికెట్ కోల్పోయింది, 61 వద్ద మరో ఓపెనర్ హసీబ్ హమీద్ (23) కూడా ఔటయ్యాడు. ఈ దశలో డేవిడ్ మలాన్, కెప్టెన్ జో రూట్ కలిసి మరో వికెట్ పడకుండా ఆచి తూచి ఆడారు. మూడో వికెట్ కు 159 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పారు. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్, కమ్మిన్స్ చెరో వికెట్ పడగొట్టారు.
నేటి ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ రెండు వికెట్లకు 220 పరుగులు చేసి, ఆసీస్ కంటే ఇంకా 58 పరుగులు వెనకబడి ఉంది.
Also Read : యాషెస్ తొలిటెస్ట్: ఆస్ట్రేలియా 343/7