England at last: ఇంగ్లాండ్- వెస్టిండీస్ మధ్య జరిగిన రెండో 20లో ఇంగ్లాండ్ ఒక్కపరుగు తేడాతో ఉత్కంతభరితమైన విజయం సాధించింది. చివరి ఓవర్లో విండీస్ ఆటగాడు అకీల్ హోస్సేన్ రెండు ఫోర్లు, మూడు సిక్సర్లతో ఇంగ్లాండ్ కు చుక్కలు చూపించాడు…. కానీ ఒక పరుగు దూరంలో విజయం చేజారింది.
బార్బడోస్, బ్రిడ్జి టౌన్ లోని కెన్సింగ్ టన్ ఓవల్ మైదానం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో వెస్టిండీస్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఇంగ్లాండ్ ఆటగాళ్ళు జేసన్ రాయ్-45; మోయిన్ ఆలీ-31; క్రిస్ జోర్డాన్-27; టామ్ బ్యంటన్-25 రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 171 పరుగులు చేసింది. విండీస్ బౌలర్లలో హోల్డర్, ఫబియన్ అల్లెన్ చెరో రెండు; కర్టేల్, అకీల్ హోస్సేన్, పోల్లర్డ్, షెఫర్డ్ తలా ఒక వికెట్ సాధించారు.
172 పరుగుల లక్ష్యంతో బరిలోగి దిగిన విండీస్ త్వరగా వికెట్లు కోల్పోయింది. ఆరు పరుగులకే ఓపెనర్లు ఇద్దరూ పెవిలియన్ చేరారు. నికోలస్-24; బ్రేవో-23లు పర్వాలేదనిపించారు. ఆ తర్వాత పోలార్డ్, హోల్డర్ ఇద్దరూ ఒక్కో పరుగు మాత్రమే చేసి ఔటయ్యారు. చివరి ఓవర్లో విజయానికి 30 పరుగులు కావాల్సి ఉంది. దీనితో ఇంగ్లాండ్ విజయం ఖాయం అనుకున్నారు. చివరి ఓవర్లో షకీబ్ మహమూద్ బౌలింగ్ లో అకీల్ హోస్సేన్ స్ట్రయిక్ లో ఉన్నాడు. రెండు వైడ్లు, రెండు ఫోర్లు, మూడు సిక్సర్లతో మొత్తం 28పరుగులు వచ్చాయి. దీనితో ఒక్క పరుగు తేడాతో ఇంగ్లాండ్ విజయం సొంతం చేసుకుంది. ఇంగ్లాండ్ బౌలర్లలో మొయిన్ అలీ మూడు, ఆదిల్ రషీద్ రెండు, రోషీ తోప్లె, క్రిస్ జోర్డాన్ చెరో వికెట్ సాధించారు.
మొయిన్ అలీ కి ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది.