జూలై 1 నుంచి 10వ తేదీ వరకూ నాలుగో విడత పల్లె ప్రగతి నిర్వహిస్తున్నామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెల్లడించారు. పల్లె ప్రగతి కార్యక్రమంపై అధికారులతో మంత్రి ఎర్రబెల్లి సమీక్షించారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు ప్రతిరోజూ ఒక గ్రామంలో పల్లెనిద్ర చేస్తారని చెప్పారు. ఈ కార్యక్రమ నిర్వహణలో నిర్లక్ష్యం వహించే సర్పంచ్ లు, అధికారులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమంతో సీజనల్ వ్యాధులు తగ్గాయన్నారు.
కేసీఆర్ సారధ్యంలో గ్రామాల రూపురేఖలు మారుతున్నాయని ఎర్రబెల్లి అన్నారు. రాజకీయాలకు అతీతంగా పాలనా వ్యవస్థలో సంస్కరణలు తెచ్చామన్నారు. ప్రతి పంచాయతీకి ఒక నోడల్ అధికారిని నియమించామని చెప్పారు. రాష్ట్రంలో 15 కోట్ల ఉపాధి హామీ పని దినాలు కల్పించామన్నారు. గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం ఎలాంటి బకాయిలు పడలేదని, గ్రామీణాభివృద్ధికి ఇప్పటివరకూ 6,500 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని ఎర్రబెల్లి వివరించారు. ప్రకృతి వనాల కోసం ప్రతి మండలానికి 10 ఎకరాలు కేటాయిస్తామని, గ్రామాల్లో మనకీ ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేస్తామన్నారు. హరిత హారం లో భాగంగా వేప, రాగి, చింత, పండ్ల చెట్లను పెంచాలని సూచించారు.