హుజురాబాద్ ప్రజల ఆత్మ గౌరవాన్ని ఎవరూ కొనలేరని మాజీమంత్రి ఈటల రాజేందర్ వ్యాఖానించారు. మంత్రి పదవి కోల్పోయిన తరువాత రెండోసారి అయన హురురాబాద్ లో పర్యటించారు. తాను ఎంతో సంస్కారంతో మర్యాద పాటిస్తున్నానని, సహనం కోల్పోతే మాడి మసైపోతారని తీవ్రంగా హెచ్చరించారు. హుజురాబాద్ ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని, ప్రజల మీద ఈగ వాలకుండా చూస్తానని వెల్లడించారు.
2006లో కరీంనగర్ లోక్ సభ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు, YS రాజశేఖర్ రెడ్డి ఎంత ఖర్చు పెట్టినా, ఎంత మందిని కొన్నా తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవాన్ని గెలిపించారని, ఇప్పుడు హుజురాబాద్ లో కూడా అదే జరుగుతుందని, ప్రజలు అమాయకులు కాదని ధీమా వ్యక్తం చేశారు.
హుజురాబాద్ పై కొందరు నేతలు తోడెళ్ళలా దాడులు చేస్తున్నారని, ఇప్పుడు మాట్లాడుతున్న నాయకులు ఒక్క రోజైనా ఇక్కడి ప్రజల బాధను పంచుకున్నారా అని ప్రశ్నించారు.
గంగుల కమలాకర్ ను ఉద్దేశించి మాట్లాడుతూ మంత్రిగా సంస్కారం సభ్యత ఉండాలని, అధికారం శాశ్వతం కాదని హితవు పలికారు. ఈటెల వెంట ఉంటే బిల్లులు చెల్లించబోమంటూ ప్రజా ప్రతినిధులను బెదిరిస్తున్నారని అది మంచి పద్దతి కాదని చెప్పారు. కావాలంటే నన్ను ఏమైనా చేయండి కానీ నా ప్రజల జోలికి రావొద్దని విజ్ఞప్తి చేశారు.
గంగుల కరీంనగర్ ను బొందల గడ్డ చేస్తున్నాడని, అయన ఎన్ని టాక్స్ లు ఎగ్గోట్టారో అందరికి తెలుసనీ… టైమ్ వచ్చినప్పుడు అన్నీ బయట పడతాయని వ్యాఖానించారు. 2023 తరువాత నువ్వు వుండవు, నీ పదవి వుండదు అంటూ గంగులకు హెచ్చరిక చేశారు
.