ఎన్ని ప్రలోభాలు పెట్టినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా హుజూరాబాద్ ఎన్నికల్లో ప్రజలు కెసియార్ కు కర్రు కాల్చివాత పెట్టడం ఖాయమని మాజీ మంత్రి ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. వెకిలి ప్రయత్నాలు మానుకోవాలని, దమ్ముంటే, ధైర్యముంటే ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు ఎదుర్కోవాలని ఈటెల సవాల్ చేశారు. అధికారులు, పోలింగ్ బూత్ లలో పనిచేసేవారు, పోలీసులను ఉపయోగించుకొని అధికార దుర్వినియోగం చేసి గెలవాలని చూస్తున్నారని, కానీ వారంతా ఈటెల గెలవాలనే కోరుకుంటున్నారని చెప్పారు. ఈటెల గెలవడమంటే తెలంగాణా ఆత్మ గౌరవం గెలిచినట్లు వారు భావిస్తున్నారన్నారు.
హరీష్ రావు ‘భావ దారిద్ర్యం’ వ్యాఖ్యలపై ఈటెల స్పందించారు. భావదారిద్ర్యం, ఆత్మగౌరవం, ద్వేషం తమ ఇద్దరిలో ఎవరికున్నాయో అయనే చెప్పాలని ఎద్దేవా చేశారు.
గత ఎన్నికల్లో తన ఓటమి కోసం ప్రత్యర్థికి డబ్బులు ఇచ్చినా, మూడు నెలలపాటు మంత్రి పదవి ఇవ్వకపోయినా ఆవేదన చెందలేదని ఈటెల గుర్తు చేశారు, అది తన సహనానికి నిదర్శమని పేర్కొన్నారు. తాను పార్టీ పెడుతున్నానని, వేరే పార్టీలోకి వెళుతున్నానని ఏవో భ్రమలతో నన్ను మంత్రి పదవి నుంచి బహిష్కరించారన్నారు. ఎవరో ఇచ్చిన దరఖాస్తు మీద నా అభిప్రాయం తెలుసుకోకుండానే నిర్దాక్షిణ్యంగా ప్రాణం ఉండగానే బొంద పెట్టాలని చూశారని, కానీ ఆ బొందలో మీ ప్రభుత్వమే పడుతుందని తీవ్రంగా హెచ్చరించారు.
తనపై చేస్తున్న కుయుక్తులను తిప్పికొట్టగలిగే సత్తా, శక్తి హుజూరాబాద్ ప్రజలకు ఉందని ఈటెల ధీమా వ్యక్తం చేశారు. ట్రెండ్ వస్తేనో, గాలికి గెలిచిన వాడినో కాదని… కాకులు దూరని కారడవిలాగా, చీమలు దూరని చిట్టడవి లాగా ఈ నియోజకవర్గానికి అల్లుకుని ఉన్నానని ఈటెల వ్యాఖ్యానించారు.
హుజురాబాద్ నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న తెల్ల రేషన్ కార్డులు, పెన్షన్ దరఖాస్తులు వెంటనే మంజూరు చేయాలని ఈటెల డిమాండ్ చేశారు. వేలాది మంది భర్తలు చనిపొయి వితంతు పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నారని, నా రాజీనామాతో నైనా వారికి పెన్షన్ వస్తుదని వారు ఆశిస్తున్నారని చెప్పారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగ భృతి ఇవ్వాలన్నారు.
వావిలాల, చల్లూరు మండలాలు కావాలని, హుజురాబాద్ జిల్లా చేయాలని గతంలో కోరానని, పరిపాలనా సౌలభ్యం మేరకు వాటిని ఏర్పాటు చేయాలని కూడా ఈటెల డిమాండ్ చేశారు. గత ఆరేడు సంవత్సరాలుగా స్థానిక సంస్థలు నిర్వీర్యం అయ్యాయని, ప్రతి మండలానికి ¬10 కోట్ల రూపాయలు, పెద్ద గ్రామాలకు కోటి రూపాయలు, చిన్న గ్రామాలైతే 50 లక్షల రూపాయలు అభివృద్ధి నిధులు ఇవ్వాలని, పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేయడానికి వెంటనే జిఓలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.