బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ను శాసనసభ సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. ఇటీవల స్పీకర్ ను మరమనిషి తో పోలుస్తూ ఈటెల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు దుమారం లేపాయి. స్పీకర్ స్థానాన్ని అవమానించే విధంగా ఈటెల వ్యవహరించారని, ఆయన బేషరతుగా క్షమాపణ చెపాలని తెరాస నేతలు డిమాండ్ చేస్తున్నారు.
అయితే ఈటెల రాజేందర్ ఈ రోజు దానిపై వివరణ ఇచ్చే సమయంలో అధికార పార్టీ సభ్యులు ముందు క్షమాపణ చెప్పిన తర్వాతనే మాట్లాడాలని డిమాండ్ చేశారు. శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ ముందుగా క్షమాపణ చెప్పాలని ఈటలకు సూచించారు. ఈటెల స్పందిస్తూ స్పీకర్ నాకు తండ్రి లాంటి వారని వివరణ ఇవ్వగా తెరాస సభ్యులు శాంతించలేదు. ముందుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
సభలో వాదోపవాదాలు పెరగటంతో సభ మూడ్ కు అనుగుణంగా వ్యవహరించాలని స్పీకర్ పోచారం … ఈటెల రాజేందర్ కు సూచించారు. స్పీకర్, మంత్రి వేముల సుమారు అయిదు సార్లు కోరినా ఈటెల స్పందించ లేదు. దీంతో మంత్రి వేముల సస్పెన్షన్ తీర్మానాన్ని ప్రవేశపెట్టడంతో స్పీకర్ ఆమోదించారు.
సభ నుంచి బయటకు వచ్చాక ఈటల రాజేందర్ ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. బలవంతంగా పోలీసు వాహనంలో ఎక్కించి అసెంబ్లీ నుండి తీసుకొని పోతున్న పోలీసులపై మండిపడ్డారు. బానిసల్లా వ్యవహరించవద్దు అంటూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ నాశనానికి ఇదంతా చేస్తున్నారని, సంవత్సర కాలంగా కుట్ర చేస్తున్నారని తెరాస నాయకత్వంపై మండిపడ్డారు. గెలిచినప్పటి నుండి ఇప్పటి వరకు అసెంబ్లీకి హాజరుకాకుండా చేస్తున్నారని ఆరోపించారు. ప్రజా సమస్యలు ప్రస్తావించకుండా గొంతు నొక్కుతున్నారన్నారు. కెసిఆర్ ను గద్దె దించే వరకు విశ్రమించనని, తెరాస తాటాకు చప్పుళ్లకు భయపడనని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.
– ఈటల రాజేందర్.
Also Read : మొక్కుబడిగా అసెంబ్లీ సమావేశాలు ఈటెల విమర్శ