-0.2 C
New York
Wednesday, November 29, 2023

Buy now

Home'ఐ'ధాత్రి ప్రత్యేకంకృష్ణా నీ బేగ బారో..

కృష్ణా నీ బేగ బారో..

ఈటల ఇంకా ఎందుకు సందేహిస్తున్నాడు..
ఏ క్షణమైతే తన మీద మీడియాలో నెగటివ్ స్టోరీస్ వచ్చాయో
అప్పుడే జరగబోయేది ఆయనకి తెలుసు కదా..
కనీసం ఎప్పుడైతే కే సి ఆర్ గెటౌట్ అన్నాడో..
అప్పుడైనా విశ్వరూపం చూపించాలి కదా..
ముఖ్యమంత్రి మీద విరుచుకుపడాలి కదా..
నీ ప్రతాపం. నా ప్రతాపం చూసుకుందాం అని ఛాలెంజ్ చేయాలి కదా.
ఇంకా సి ఎమ్ తో పాత స్నేహాన్ని నెమరవేయడం ఎందుకు?
ప్రభుత్వం తప్పుల్ని చెప్పడానికి నీళ్ళు నమలడం ఎందుకు?
ఇటు ప్రభుత్వం మీద కోపం కసి వున్న వాళ్ళు..
అటు ఈటల మీద అభిమానం వున్నవాళ్ళు.. ఒకటే కోరుతున్నారు.
ఈటల ఫ్రంట్ ఫుట్ కి రావాలి..
వచ్చే బాల్ ఏదని చూడకుండా సిక్స్ కొట్టాలి..
అధికార పార్టీ బెంబేలెత్తి పోవాలి.
ఏ బాల్ వేయాలి.. ఏం ఫీల్డింగ్ చేయాలో తెలియక తికమక పడిపోవాలి..
ఇవన్నీ ఈటలకి తెలియవా..
తెలుసు కానీ, డిఫెన్స్ ఎందుకు ఆడుతున్నారు.
అసలు కొన్నాళ్లు మ్యాచ్ కే దూరంగా వుండాలని ఎందుకు అనుకుంటున్నాడు..
….
అర్జనుడికి యుద్ధం చేతకాక కాదు.
ఆయుధాలు లేక కాదు..
ఆయుధం పట్టి ప్రత్యర్థి భరతం పట్టాలంటే రథ సారథి ఒకరు కావాలి.
భారత యుద్ధం జరగాలంటే సర్వం తెలిసిన శ్రీకృష్ణుడు వుండాల్సిందే..


ఒకళ్లా ఇద్దరా.. కౌరవులు వందమంది..
అయినా పంచపాండవులని ఓడించడానికి ఒక జూదరి కావాలి.
ప్రత్యర్థి బలహీనత తెలిసిన ఒక శకుని కావాలి..

ధర్మ సంకటం ఒకటుంటుంది.
టుబీ నాట్టు బీ డైలమా పురాణాల కాలం నుంచే వుంది…
అందుకే..
సరైన టైమ్ లో సరైన సలహా ఇచ్చే ఒక పెద్దాయన కావాలి.
నీకేం కాదోయ్. నేనున్నా ప్రొసీడ్ అని చెప్పాలి.
బ్యాక్ గ్రౌండ్ నేను చూసుకుంటా.. నువ్వు దూసుకుపో అని ధైర్యం ఇవ్వాలి..
..
ఏదో ఒక అవమానం..
దానికి ప్రతీకారం.,
ఒక ఆధిపత్యం
దానిపై తిరుగుబాటు
గడిచిన నాలుగైదు దశాబ్దాలుగా తెలుగునాట రాజకీయాలను ఇవే నిర్ణయిస్తున్నాయి.
ఇందిరాగాంధీ అవమానించిందని ప్రతీకారంగా ఎన్టీయార్ ,
ఎన్టీయార్ మీద తిరుగుబాటుతో చంద్రబాబు సి ఎమ్ అయ్యారు.
చంద్రబాబు అవమానించాడనే టీఆర్ ఎస్ పుట్టింది.
సోనియా కాదన్నందుకే జగన్ సొంతపార్టీ పెట్టుకున్నారు.

పైన చెప్పిన ఏ సందర్భంలోనూ ఏఒక్క నేతా ఒంటరికాదు..
ఎన్టీ రామారావుకి నాదెండ్ల వుండేవాడు..
సినీగ్లామర్ కి పోలిటికల్ గ్రామర్ అద్దేవాడు..
ఎన్టీయార్ ఎక్కిన చైతన్యరథానికి కనపడని సారధి నాదెండ్లే అని టాక్.

చంద్రబాబుకీ రామోజీ వున్నాడు.
నచ్చినవాళ్ళు కృష్ణుడు అనొచ్చు.నచ్చని వాళ్ళు శకుని అనొచ్చు. కానీ, వైస్రాయ్ వ్యవహారం నుంచి విజయవాడ రాజధాని వరకు చంద్రబాబుకు రామోజీ సలహాలు అందుతూనే వున్నాయి..

వైయస్ రాజశేఖర్ రెడ్డి సమరానికి సై అనే టైమ్ కి
కేవిపి కృష్ణావతారం తో రెడీగా వున్నాడు.
పాదయాత్రైనా, ప్రభుత్వంలో పాత్ర అయినా..కేవిపి లేకుండా
రాజశేఖర్ చరిత్ర లేదు.

ఆ తర్వాత, తరం మారింది.
నేతల తెలివి మారింది..
ఒక్కడే కృష్ణుడు ఎందుకుండాలి..
తమ క్రెడిట్ ను ఆ వ్యక్తితో ఎందుకు పంచుకోవాలి అనే ఆలోచన మొదలైంది.
అందుకే ఇటు కే సి ఆర్ కానీ, అటు జగన్ కానీ ఒకడినే నమ్ముకోలేదు ,
ఉద్యమాన్ని ఎన్నికల రాజకీయంతొ కలిపి నడపాలన్న కిటుకు కేసిఆర్ ఒక్కడి మదిలోనే పుట్టింది కాదు.
నీళ్ళు, నిధులు నియామకాలు లాంటి జనం నాడిని పట్టే నినాదాలు కూడా కేసిఆర్ కపోల కల్పితమే కాదు.
ప్రొఫెసర్ జయశంకర్ నుంచి ప్రొఫెసర్ కోదండరామ్ వరకు ఎందరి భుజాల మీద గానో కేసి ఆర్ యుద్ధం సాగింది.
..
జగన్ కు స్వతహాగా తెగింపు మొండితనం ఎంత వున్నా..ఆయనవెనుక కూడా అధికార ,అనథికార వ్యూహకర్తలున్నారు.
విజయసాయి రెడ్డి ,సజ్జల లాంటి పార్టీలో వ్యక్తులేకాక, ప్రశాంత్ కిషోర్ లాంటి బయటి కృష్ణులు కూడా జగన్ వెంట వున్నారు.

ఇప్పుడు మళ్ళీ రాజకీయం అలాంటిఒక తిరుగుబాటు దశలో ఆగింది. కేసిఆర్ గెంటేసిన వాళ్లు. కేసిఆర్ అంటే పడక వెళ్ళి పోయిన వాళ్ళు చాలా మందే వున్నారు. వాళ్ళంతా ఒకెత్తు.. ఈటల ఇంకొకెత్తు. ఒక పక్క టీ ఆర్ ఎస్ లో అధికారం తరం మారే సందర్భం. ఇంకో పక్క ఈటల తో పాటు, మరి కొందరు సీనియర్లను వదిలించుకునే సమయం.

అందుకే ఈటల నిర్ణయం ఇప్పుడు కీలకం. కానీ, ఆ నిర్ణయం తీసుకోడానికి, అమలు చేయడానికీ ఇప్పుడు ఈటలకి ఒక బ్యాక్ బోన్ కావాలి. అన్నీ తానై చూసుకునే అండ కావాలి. ఆలోచననీ ఆచరణనీ పంచుకునే తోడు కావాలి.
ప్రతి వ్యూహం పద్మవ్యూహం కావాలి.
ప్రతి ఎత్తుగడా ప్రత్యర్థిని అయోమయం లో పడేయాలి
ప్రతి మాటా.. తూటాలా పేలాలి.
ఇవన్నీ తెరవెనుకే వుండి నడిపించే నిస్వార్థ సారథి కావాలి.
కానీ ఈటల వెంట ప్రస్తుతానికి అలాంటి కృష్ణుడు కనిపించడంలేదు.
అందుకే ఈటల మాటల్లో గందరగోళం
వ్యూహంలో అయోమయం..
నిర్ణయంలో తాత్సారం .. అలాగే వున్నాయి.
ఇంకొన్నాళ్ళు వుంటాయి.
ఇప్పుడున్నదంతా ఆయన భుజం మీద తుపాకీ పెట్టి పేల్చాలనుకునే వాళ్లే.
కానీ, ఆయనకి ఆయుధంగా నిలబడేవాడు వచ్చేదాకా ఈటల ఏ నిర్ణయం తీసుకోలేకపోవచ్చు.. అప్పటి దాకా వెయిట్ అండ్ వాచ్..

-శైలి

RELATED ARTICLES

Most Popular

న్యూస్