Sindhooram: కృష్ణవంశీ తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి ‘రంగమార్తాండ‘ రెడీ అవుతోంది. బ్రహ్మానందం ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమా, ప్రతి ఒక్కరినీ కదిలించి వేయడం ఖాయమని కృష్ణవంశీ చెబుతున్నారు. తాజా ఇంటర్వ్యూ లో ఆయన మాట్లాడుతూ .. “నా అసలు పేరు ‘బంగార్రాజు’ .. సినిమాల్లోకి వచ్చిన తరువాత వంశీకృష్ణగా మార్చుకున్నాను. ఆ తరువాత అది కృష్ణవంశీ అయింది. ‘శివ’ సినిమాకి రాము దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాను. ఒక కథను గురించి .. ఒక సీన్ గురించి .. ఒక పాత్రను ఎలా డిజైన్ చేయాలనే విషయాలను గురించి ఆయన దగ్గరే తెలుసుకున్నాను.
డైరెక్టర్ అయిన తరువాత నా కెరియర్ ఇలా ఉండాలి అని నేను ఎప్పుడూ డిజైన్ చేసుకోలేదు. ప్రేక్షకులకు ఎలాంటి సినిమాలను ఆశిస్తున్నారు అనేది కాకుండా .. నా నుంచి వాళ్లకి ఎలాంటి సినిమాలు వెళ్లాలి అనే విషయాన్ని మాత్రమే నేను ఆలోచన చేశాను. నేను చేసే సినిమా మంచిదై ఉండాలి .. సమాజానికి ఉపయోగపడేదై ఉండాలనే ఒక అభిప్రాయం నాలో బలంగా ఉండేది. అందువల్లనే ఒక ‘ఖడ్గం’ .. ‘మహాత్మా’ .. ‘అంతఃపురం’ వంటి సినిమాలు వచ్చాయి. నా కథలను బట్టే నేను హీరోలను సంప్రదిస్తాను .. అంతేగానీ అవకాశాలు ఇవ్వండి అని నేను ఎవరినీ ఎప్పుడూ అడగలేదు.
అలాగే ప్రయోగాలను ఇతర నిర్మాతలపై నేను రుద్దాలనుకోను. ‘సిందూరం’ చేయడానికి నిర్మాతలు ముందుకు రాకపోతే నేనే నిర్మాతగా ఆ సినిమాను తీశాను. ఆ సినిమా ఫ్లాప్ అయింది .. నష్టాలు రావడం వలన అప్పుల పాలయ్యాను. అయినా నేనేమీ బాధపడలేదు. ఎందుకంటే ఆ సినిమా ద్వారా నేను చెప్పదలచుకున్నది చెప్పేశాను. అప్పట్లో సరిగ్గా ఆడకపోయినా .. ఇప్పటికీ ఆ సినిమాను గురించి గొప్పగా మాట్లాడుకుంటున్నారు .. ఆ సినిమా వలన నేను ఇప్పటికీ గౌరవించబడుతూనే ఉన్నాను” అంటూ చెప్పుకొచ్చారు.
Also Read : కృష్ణవంశీ రంగమార్తాండ టైటిల్ లోగో విడుదల