Friday, April 19, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంమహిళలని గౌరవించడం అంటే!

మహిళలని గౌరవించడం అంటే!

Gender Equality: నా స్నేహితుడు ఇంటికి వచ్చాడు. సాదరంగా ఆహ్యానించి కాసేపు మాటలయ్యాక ‘ కూర్చో, గిన్నెలు కడిగేసి వస్తా’ అన్నా. దాంతో నా ఫ్రెండ్ నా వైపు ఆరాధనగా చూస్తూ ‘నువ్వు నీ భార్యకి భలే హెల్ప్ చేస్తున్నావే! నేను ఎప్పుడూ చెయ్యను. ఎందుకంటే నా భార్య అస్సలు మెచ్చుకోదు. మొన్న ఇల్లంతా శుభ్రంగా తుడిచా. అయినా థాంక్స్ చెప్పలేదు’ అన్నాడు.  దాంతో నేను పని పక్కనపెట్టి అతని పక్కనే కూర్చుని ఇలా అన్నాను ‘నేను నా భార్యకి సహాయం చెయ్యడం లేదు. ఆమెకి అవసరం లేదు కూడా. మేమిద్దరం జీవిత భాగస్వాములం, అంటే అన్నీ పంచుకోవాలి. ఏ బాధ్యత అయినా సరే. పనులన్నీ ఇద్దరం కలసి చేసుకోవాలి. గిన్నెలు తోమడం, బట్టలు ఉతకడం, వంట చేయడం … ఇలాంటివన్నీ నేనూ చేస్తాను. సహాయంగా కాదు, నా ఇంటి పనులు కాబట్టి . పిల్లల పనులైనా సరే , వాళ్లు నాకూ పిల్లలైనపుడు వారి పని చేయడం నా బాధ్యత. నా భార్యకు సహాయంగా కాకుండా భాగస్వామిగా ఈ పనులన్నీ చేస్తా. ఇదంతా వింతగా ఉందా ? పోనీ నువ్వు నీ భార్యకు ఈ పనులన్నీ ఆమె చేస్తున్నందుకు ఎప్పుడైనా థాంక్స్ చెప్పావా? లేదు కదా! నువ్వు పెరిగిన పురుషాధిక్య సమాజం ఒప్పుకోదేమో! నీకుమాత్రం ఎప్పుడన్నా సహాయం చేస్తే మెచ్చుకోవాలా ? అవునులే, చిన్నప్పటినుంచి అలా పెంచి ఉంటారు. ఆ పనులన్నీ ఆడవాళ్లే చెయ్యాలి . నువ్వు చూస్తూ ఉండాలని. కదా ! కానీ బ్రదర్! ఇప్పటికైనా ఆమెని మెచ్చుకో. నిన్ను మనసారా ఎలా అభినందించాలనుకున్నావో అలా. ఒక అతిథి లా తిండి, ఇతర సౌకర్యాలు తీర్చుకోడం కోసం కాకుండా నిజమైన జీవిత భాగస్వామిలా ప్రవర్తించడం నేర్చుకో. నీ ఇంటిని ప్రేమించు. ప్రతి పనిలో భాగమైతేనే అది సాధ్యం. భావితరాలకు కూడా చిన్నతనం నుంచే ఈ భావన, భాగస్వామ్యం అలవాటు చెయ్యాలి. ఏమంటావ్?’…

… ఇదంతా ఈ మధ్య నెట్టింట చక్కర్లు కొడుతున్న కథ. మగవారంతా అలా ఉంటే బాగుంటుంది కదా! అణువణువున పురుషాహంకారం నిండిన సమాజంలో ఇటువంటి మార్పు సాధ్యమేనా? ఒకవేళ ఎవరన్నా అబ్బాయిలు అందుకు సిద్ధమన్నా వాళ్ళ ఇంట్లో ఒప్పుకుంటారా? … అంటే పట్టించుకోకుండా ముందుకు సాగిపోవలసిందే అనే యువకులూ ఉన్నారు.

తరం మారుతున్నది
సాధారణంగా పెళ్లిళ్లలో పెళ్లికూతురు పెళ్ళికొడుకు పాదాలను తాకి నమస్కరిస్తుంది. అయితే ఇటీవల కొందరు యువతీ యువకులు ఈ సంప్రదాయాన్ని మార్చారు. పెళ్ళిలో ఇద్దరూ సమానమేనంటూ పెళ్లికూతురి పాదాలు తాకి నమస్కరించారు. అందరినీ వదిలి తమ ఇంట లక్ష్మిలా అడుగెడుతున్న ఆడవారిని ఇలాగే గౌరవించాలంటున్న యువకులకు అభినందనలు అందుతున్నాయి. చూస్తుంటే మార్పు మొదలవుతున్నట్లే ఉంది.

కళ్ళు తెరవండి
మరో అద్భుతమైన వీడియో ఈ మధ్య వైరల్ అయింది. మహిళలనే కాదు, మగవారినీ ఆలోచనలో పడేస్తున్న ఈ వీడియోలో ఏముందంటే…

వయసులవారీగా స్త్రీ పురుషులను ఓకే వరుసలో నుంచోబెట్టారు. వారిలో విద్యార్థుల నుంచి వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారు, రిటైరైన వారు ఉన్నారు. మొదటగా వారిని మాములు ప్రశ్నలు అడుగుతూ తెలిసిన వారిని ఒక అడుగు ముందుకు, లేని వారిని ఒక అడుగు వెనక్కి వెయ్యమన్నారు. ఉదాహరణకి చిన్నతనంలో ఆటలు ఆడటం, కాఫీ చెయ్యడం, పదేళ్లలోపు సైకిల్ నేర్చుకోడం … ఇలా చాలామంది ముందుకు, కొద్దిమంది వెనక్కి జరిగారు. మెల్లగా ప్రశ్నలు రూపు మార్చుకున్నాయి. ఆర్థిక విషయాలు … సొంతంగా కార్ కొన్నారా, ఎవరి సహాయం లేకుండా డబ్బు మదుపు చెయ్యడం, షేర్ల పెట్టుబడి, ఇల్లు కొనగలరా…ఇలా. ఒక్కో ప్రశ్నకు మహిళలు ఒక్కో అడుగు వెనక్కి వేస్తూ చివరకు మగవాళ్ళు ముందుకు, ఆడవాళ్లు వెనక్కి ఉండిపోతారు. అప్పుడు అందరికీ అర్థమైంది ఆర్థిక విషయాల్లో మహిళల్ని ఎదగనివ్వలేదని. పాల్గొన్న చాలామంది తమ కళ్ళు తెరచుకున్నాయని , పిల్లలకు చిన్నతనం నుంచీ ఆర్థిక విషయాలు కూడా బేధభావాలు లేకుండా నూరిపోయాలని అభిప్రాయపడ్డారు.

మహిళా దినోత్సవ సందర్భంగా ఇంతమంచి ప్రకటన రూపొందించి పేటీఎం వారు నిజమైన కానుక అందించారు. స్ఫూర్తి దాయకమైన ఈ వీడియో చూస్తే మీకే విషయం అర్థమవుతుంది. ఆలోచనా మొదలవుతుంది.

‘మహిళా దినోత్సవ శుభాకాంక్షలు’

-కె. శోభ

Also Read :

ఇంతేనా మహిళా దినోత్సవమంటే?

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్