దేశంలో కరోనా కేసుల ఉద్ధృతి కొనసాగుతోంది. నిన్నటితో పోలిస్తే ఇవాళ కొవిడ్ బారిన పడిన వారి సంఖ్యలో కాస్త పెరుగుదల నమోదైంది. గడిచిన 24 గంటల్లో 41,195 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న ఈ సంఖ్య 38,353గా ఉంది. ప్రస్తుతం దేశంలో 3,87,987 కరోనా యాక్టివ్ కేసులున్నట్లు కేంద్ర వైద్యారోగ్యశాఖ తెలిపింది. కరోనా రికవరీ రేటు 97.45 శాతంగా ఉంది.
5 రోజుల్లో 242 మంది పిల్లలకు కరోనా పాజిటివ్
పిల్లల్లో కరోనా వేగంగా వ్యాపిస్తోంది. గడచిన ఐదు రోజుల్లో బెంగళూరు నగరంలో 242 మంది చిన్నారులకు కొవిడ్ సోకడమే దీనికి నిదర్శనం. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు పిల్లల పట్ల జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. బెంగళూరులో ఐదు రోజుల వ్యవధిలోనే ఏకంగా 242 మంది చిన్నారులకు కొవిడ్ పాజిటివ్ నిర్ధరణ అయింది. ఈ మేరకు బెంగళూరు నగరపాలిక ఓ నివేదికను విడుదల చేసింది. దీనిప్రకారం 9 ఏళ్లలోపు చిన్నారులు 106 మంది కరోనా బారిన పడగా.. 9 నుంచి 19 ఏళ్ల వారిలో 136 మంది వైరస్ బారినపడ్డారు. కొవిడ్ థర్డ్ వేవ్ వస్తే చిన్నారులపై అధిక ప్రభావం ఉంటుందని భావిస్తోన్న ఈ తరుణంలో ఇలా తక్కువ వ్యవధిలో పెద్ద సంఖ్యలో చిన్నారులు కొవిడ్ బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. చిన్నారుల్లో కొవిడ్ ముప్పు మరింత పెరిగే అవకాశం ఉందని ఆరోగ్య శాఖ హెచ్చరించింది. గత కొన్ని రోజులుగా నగరంలో రోజూ 350-450కరోనా కేసులు నమోదవుతున్నాయి. దాదాపు ఐదువేల యాక్టివ్ కేసులు ఉన్నాయి. మొత్తం కేసులలో ఐదు శాతం చిన్నపిల్లలకు సోకింది. ఆసుపత్రి పాలయ్యే పిల్లల రేటూ ఎక్కువగానే ఉంది. కరోనా కారణంగా పిల్లలకు సాధారణంగా ఇచ్చే టీకాల పంపిణీ నాలుగు నెలలుగా నిలిచిపోయింది. ఇది గతవారం ప్రారంభమైంది. ఇది పిల్లల్లో కొవిడ్ నివారణకు దోహదపడుతుంది. ప్రస్తుతానికి ఆక్సిజన్ పడకలు అవసరమయ్యే పిల్లల సంఖ్య చాలా తక్కువగానే ఉంది. పిల్లల ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాల్సిందే.” – రణదీప్, కమిషనర్ ఆఫ్ హెల్త్. తమ పిల్లల పట్ల తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు పాటిస్తూ.. నిబంధనలను అనుసరించాలని నిపుణులు సూచిస్తున్నారు.