F3: More Fun
‘పటాస్’ నుండి ‘సరిలేరు నీకెవ్వరు’ వరకు ఒకదానిని మించి మరొకటి వరుసగా బ్లాక్ బస్టర్ విజయాలతో అపజయమెరుగని దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు డైరెక్టర్ అనిల్ రావిపూడి. ప్రస్తుతం ‘ఎఫ్3’ తో మరింత వినోదాన్ని అందించేందుకు రెడీ అవుతున్నారు. విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రిన్ తమ పాత్రలను పోషిస్తున్నారు. దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ మీద శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నవంబరు 23 అనిల్ రావిపూడి పుట్టిన రోజు. ఈ సందర్భంగా అనిల్ రావిపూడి చెప్పిన చిత్ర విశేషాలు ఆయన మాటల్లోనే..
డైరెక్టర్ అయ్యాక ఇది ఆరో బర్త్ డే. ఇంకా ఎంతో ప్రయాణించాల్సి ఉంది. బర్త్ డే అయినా కూడా ‘ఎఫ్3’ సెట్‌లో పని చేస్తున్నాను. అదే ఈ బర్త్ డే ప్రత్యేకం. ‘ఎఫ్2’ ను ఎలా ఎంజాయ్ చేశారో అంతకు మించి ఎంజాయ్ చేస్తారు. ఈసారి కూడా సంక్రాంతికి వస్తే హ్యాట్రిక్ అయ్యేది. కానీ పెద్దఎత్తున విడుదల చేయాలని, సోలో రిలీజ్ చేయాలని సంక్రాంతి నుంచి తప్పుకున్నాం.
‘ఎఫ్2’లో భార్యభర్తల మధ్య ఉంటుంది. కానీ ‘ఎఫ్3’లో డబ్బు చుట్టూ తిరుగుతుంది. ఇందులో పాత పాత్రలన్నీ ఉంటాయి. మరికొన్ని కొత్త పాత్రలు యాడ్ చేశాం. సునీల్, మురళీ శర్మ పాత్రలను కొత్తగా తీసుకున్నాం. ముందే సీక్వెల్ చేయాలని అనుకున్నాం. కానీ అప్పుడు అంత సీరియస్‌గా కథ అనుకోలేదు. మనకంటూ ఓ ఫ్రాంచైజీ ఉంటే బాగుంటుందని అంతా అనుకోవాలి. ‘సరిలేరు నీకెవ్వరు’ వంటి సీరియస్ సబ్జెక్ట్ చేసిన తరువాత మంచి కామెడీ ఎంటర్టైనర్‌గా చేయాలని అనుకున్నాను.
‘ఎఫ్2’ వల్ల వచ్చిన కిక్కో, ఎనర్జీ వల్లో గానీ వెంకటేష్, వరుణ్ తేజ్ యాక్టింగ్ ఇరగదీశారు. మీరు ఎన్ని అంచనాలు పెట్టుకుని వచ్చినా దాని కంటే ఎక్కువగానే ఉంటుంది. సినిమా షూటింగ్ దాదాపు 80 శాతం పూర్తయింది. ఇంకా రెండు పాటలు మిగిలి ఉన్నాయి. కొంత టాకీ పార్ట్ కూడా ఉంది. డిసెంబర్ కల్లా టాకీ పార్ట్ కంప్లీట్ అవుతుంది. ఫిబ్రవరిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది.
Also Read : ఫిబ్రవరి 25న విడుదల కానున్న ‘ఎఫ్-3’