Saturday, January 18, 2025
HomeTrending Newsయేసంగిలో ప్రభుత్వం వరి కొనుగోలు చేయదు

యేసంగిలో ప్రభుత్వం వరి కొనుగోలు చేయదు

Farmers Should Cultivate Other Crops As An Alternative To Paddy Minister Niranjan Reddy :

యాసంగిలో వరి సాగు చేయవద్దని, యాసంగిలో ఎట్టి పరిస్థితులలో ప్రభుత్వం వడ్లు కొనుగోలు చేయదని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. అయితే విత్తన వడ్లు సాగు చేసే రైతులు, మిల్లర్లతో ఒప్పందం చేసుకునే రైతులు నిరభ్యంతరంగా వరి సాగు చేసుకోవచ్చన్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్ మంత్రుల నివాస సముదాయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, పాల్గొన్న పౌరసరఫరాల మంత్రి గంగుల కమలాకర్, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్, పౌరసరఫరాల కమీషనర్ అనిల్ కుమార్ పాల్గొన్నారు.

ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్న ఆశతో మాత్రం రైతులు వరి సాగు చేయవద్దని, ఇది తెలంగాణ ప్రభుత్వ విధాన నిర్ణయమని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. వరికి ప్రత్యామ్నాయంగా రైతులు ఇతర పంటలను సాగు చేసుకోవాలని కోరారు. వానాకాలంలో ‘వరి’సాగుపై ఎలాంటి ‘వర్రీ’ వద్దని, ఎఫ్ సీ ఐ కొనకున్నా తెలంగాణ ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. దొడ్డు వడ్లయినా, సన్నరకాలయినా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, యాసంగి వరి కొనుగోళ్ల విషయంలో  కేంద్రప్రభుత్వం నానా యాగీ చేస్తుందన్నారు.

కేంద్రం చేతగానితనాన్ని రాష్ట్రాల మీద నెట్టివేస్తుందని, యాసంగిలో నూక శాతం ఎక్కువ ఉంటుంది .. నూక లేని వరి వంగడాల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నామని మంత్రి వెల్లడించారు. యాసంగి సాగును ఒక నెల ముందుకు జరుపుకోవాలని, రైతులపట్ల మా చిత్తశుద్దిని ఎవరూ శంకించలేరన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిండు మనసుతో వ్యవసాయరంగాన్ని తీర్చిదిద్దారని, వారి కృషి ఫలితమే తెలంగాణలో దిగుబడి అవుతున్న పంటలని మంత్రి పేర్కొన్నారు.

ఒక కోటి 41 లక్షల ఎకరాలలో వివిధరకాల పంటలు సాగయ్యాయని, 62 లక్షల 8 వేల ఎకరాలలో ఈ వానాకాలంలో వరి సాగు నమోదయిందని మంత్రి వివరించారు. నాలుగైదు నెలలుగా వరి సాగులో ఇబ్బందులను రైతుల దృష్టికి తీసుకెళ్లి చైతన్యం చేస్తున్నామని, విపక్షాలు రైతులను రెచ్చగొట్టి రాజకీయం లబ్ది కోసం ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. రైతాంగం విపక్షాల చేతులలో పావులుగా మారవద్దని, ఈ వానాకాలం పత్తి సాగు చేయాలని రైతులకు మంత్రి విజ్ఞప్తి చేశారు. అయితే అనుకున్నంతగా రైతాంగం పత్తి సాగు చేయలేదని, ఈ రోజు మద్దతుధరకు మించి మూడు వేలు ఎక్కువకు పత్తి సాగు జరుగుతుందన్నారు.సీసీఐ మద్దతుధరకు మించి ఎక్కువ ధర లభిస్తున్నదని, కోటి ఎకరాలలో పత్తి సాగు చేసినా రైతులకు మద్దతుధర దక్కుతుందన్నారు. తెలంగాణ పత్తికి అంతర్జాతీయ డిమాండ్ ఉన్నదన్నారు.

గత ఏడాది కేంద్రం మాట ఇచ్చిన నేపథ్యంలో తీసుకున్న ధాన్యంలో 5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఇంకా తెలంగాణ ప్రభుత్వం వద్ద మూలుగుతున్నదన్నారు.కేంద్రం బాధ్యతారాహిత్యానికి ఇది నిదర్శనం .. దేశంలో పంటల కొనుగోళ్ల విషయంలో వారికి ఒక విధానం లేదని మంత్రి నిరంజన్ విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం చెప్పేది అబద్దమైతే యాసంగి కొనుగోళ్లు చేస్తాం అని బీజేపీ ప్రజాప్రతినిధులు కేంద్రం నుండి లిఖితపూర్వక హామీ తీసుకురావాలి. భారత ఆహారరంగాన్ని కార్పోరేట్లు, ప్రైవేటుపరం చేసే కుట్రలో భాగంగా కేంద్రం కొనుగోళ్ల బాధ్యత నుండి తప్పుకుంటున్నదని మంత్రి ఆరోపించారు.కామారెడ్డిలో రైతు మరణం దురదృష్టకరం .. ప్రభుత్వం ఈ సంఘటనపై నివేదిక తెప్పించుకున్నదన్నారు.

వరి కొనుగోలు కేంద్రాల ఏర్పాటు విషయంలో ఆపోహాలు అవసరం లేదు .. కోతలను బట్టి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరుగుతున్నదని మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు. రాష్ట్రంలో 6570 కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఇప్పటివరకు 2.36 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందని తెలిపారు. ప్రైవేటు మిల్లర్ల వద్ద టోకెన్ సిస్టం ఉంది .. అది సూర్యాపేట, నల్లగొండ జిల్లాలకు పరిమితమన్నారు.

ఇవి కూడా చదవండి: ధాన్యం కొనుగోలుపై కేంద్రం వైఖరి ఏంటి – మంత్రి ఎర్రబెల్లి

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్