Thursday, March 28, 2024
HomeTrending Newsహైదరాబాద్ లోతట్టు ప్రాంతాలు జలమయం

హైదరాబాద్ లోతట్టు ప్రాంతాలు జలమయం

హైదరాబాద్ మహానగరానికి గులాబ్ తుఫాన్ గుబులు పట్టుకుంది. ఆదివారం రాత్రి నుంచే నగరంలోని వివిధ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉదయం 8 గంటల నుంచి 4 గంటల వరకు నగరంలోని వివిధ ప్రాంతాల్లో సగటున 3.4 సె.మీ.ల వర్షపాతం నమోదు కాగా, సోమవారం సాయంత్రం నాలుగు నుంచి ఐదు గంటల మధ్య 2 సె.మీ.ల వర్షపాతం నమోదైనట్లు జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. మొత్తానికి గ్రేటర్ హైదరాబాద్ లో సాయంత్రం ఐదు గంటల కల్లా ఐదున్నర నుంచి ఆరు సెం.మీ.ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. అత్యధికంగా ఆరు సెంటమీటర్ల వర్షపాతం కాప్రా సర్కిల్‌లో నమోదైనట్లు బల్దియా అధికారులు వెల్లడించారు.

ఉదయం నుంచి అడపా దడపాగా వర్షపు జల్లులు కురిసినా, సాయంత్రం నాలుగు గంటల నుంచి ఐదు గంటల మధ్య కురిసిన కుండపోత వర్షానికి నగరంలో మొత్తం పరిస్థితులు మారిపోయాయి. లోతట్టు ప్రాంతాల్లోకి మొకాలి లోతు వరకు నీరు చేరింది. పలు ప్రాంతాల్లో నాలాలు పొంగి ప్రవహించటంతో ఇళ్లలోకి నీరు చేరింది అహ్మద్ నగర్ ప్రాంతంలో బల్కాపూర్ నాలా ఉదయం నుంచే ఉధృతంగా ప్రవహిస్తోంది, ఈ క్రమంలో సాయంత్రం నాలుగు నుంచి ఐదు గంటల మధ్య కురిసిన వర్షం కారణంగా పొంగి ప్రవహించటంతో లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి మురుగు నీరు వచ్చి చేరింది. నిత్యం రద్దీగా ఉండే ప్రధాన కూడళ్లలో భారీగా వరద నీరు నిలిచి చిన్న సైజు చెరువులను తలపించాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

గత అక్టోబర్ మాసంలో కూడా ఇదే తరహాలో భారీ వర్షం కురిసి పలు కాలనీలు, లోతట్టు ప్రాంతాలు, బస్తీలు నీట మునగటంతో ఈ సారి బల్దియా అధికారులు కాస్త ముందుగా కళ్లు తెరిచి, ఆయా ప్రాంతాల్లో సహాయక చర్యలను చేపట్టారు. ముందస్తుగా జోన్ కు రెండు బోట్లను, నీటిని తోడేసే మొటారు పంపులను అందుబాటులో పెట్టారు. సాయంత్రం కురిసిన వర్షానికి నగరంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ జాం అయ్యింది. కాస్త ఎత్తైన ప్రదేశమైన బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో సుమారు కిలోమీటరు పొడువున వాహనాలు క్యూ కట్టాయంటే, ఇక దిగువ ప్రాంతాలైన లక్టీకాపూల్, ట్యాంక్ బండ్, నాంపల్లి, బషీర్ బాగ్, ఎంజే మార్కెట్, అబిడ్స్ ప్రాంతాల్లోని ట్రాఫిక్ సమస్య మరింత జఠిలమై ఆర్టీసీ బస్సులు కూడా ముందుకు కదలని పరిస్థితులు నెలకొన్నాయి.

తెల్లవారుజాము నుంచే కమాండ్ కంట్రోల్ ఫంక్షన్

వాతావరణ శాఖ హెచ్చరికలతో ఆదివారం రాత్రి నుంచే అప్రమత్తమైన బల్దియా అధికారులు క్షేత్ర స్థాయి సిబ్బంది అంతా తెల్లవారుజాము నుంచే విధుల్లో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. జోనల్ కమిషనర్లు, సర్కిళ్లలోని డిప్యూటీ కమిషనర్లంతా క్షేత్ర స్థాయిలో పరిస్థితులను ఎప్పటికపుడు తెలుసుకొని వర్షం పట్ల ప్రజలను అప్రమత్తం చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులకు అధికారులను అప్రమత్తం చేసేందుకు బల్దియాలో ఇప్పటికే కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఈ కమాండ్ కంట్రోర్ రూమ్ కు మధ్యాహ్నాం ఒకటిన్నర గంటల కల్లా సుమారు 169 ఫిర్యాదులు వచ్చినట్లు, వాటిలో దాదాపు 140 ఫిర్యాదులను అధికారులు పరిష్కరించినట్లు వెల్లడించారు. ఎక్కువ శాతం ఫిర్యాదులు డ్రైనేజీలు, మ్యాన్ హోళ్లు పొంగి ప్రవహిస్తున్న అంశంపైనే వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.

క్షణ క్షణం.. భయం భయం

గులాబ్ తుఫాన్ ప్రభావంతో మంగళ, బుధవారాల్లో కూడా నగరానికి అతి భారీ నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో నాలా పరివాహక ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలు, చెరువుకు దిగువన ఉన్న చాలా శివారు ప్రాంతాల ప్రజలు ఎపుడు ఏం జరుగుతుందోనని ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. గత అక్టోబర్‌లో కూడా ఇదే తరహాలో వర్షం కురిసి అపార్ట్ మెంట్లలోకి కూడా నీరు వచ్చిన ప్రాంతాల్లో బల్దియా అధికారులు సోమవారం సాయంత్రం వరకు ఎలాంటి వరద నివారణ చర్యలు చేపట్టకపోవటం పట్ల ప్రజల్లో ఆందోళన మరింత రెట్టింపయ్యింది

RELATED ARTICLES

Most Popular

న్యూస్