జమ్మూ కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి పై రాజీ పడే ప్రసక్తే లేదని గుప్కర్ కూటమి తేల్చి చెప్పింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో జరిగే అఖిలపక్ష సమావేశంలో 370 ఆర్టికల్ పునరుద్దరణ, స్వయంప్రతిపత్తి కోసం ఉమ్మడిగా ఒత్తిడి చేయాలని, రాజ్యాంగ హక్కులు అడగాలని తీర్మానించింది. ఎల్లుండి ప్రధానితో చర్చించాల్సిన అంశాలపై ఈ రోజు గుప్కర్ కూటమి నేతలు శ్రీనగర్ లో సమావేశమయ్యారు. నేషనల్ కాన్ఫరెన్సు నేత ఫరూక్ అబ్దుల్లా, పిడిపి నాయకురాలు మహబూబా ముఫ్తీ, సిపిఐ ఎం నేత మహమ్మద్ యూసుఫ్ తరిగామి, ఒమర్ అబ్దుల్లా తదితర నేతలు సమావేశంలో పాల్గొన్నారు.
గుప్కర్ ప్రజా కూటమిలోని పార్టీలకు వేర్వేరుగా కేంద్రం నుంచి ఆహ్వానం వచ్చిందని , ఆ ప్రకారమే ఎవరికీ వారు వ్యక్త్రిగతంగా అఖిలపక్ష సమావేశంలో పాల్గొంటారని ఫారుక్ అబ్దుల్లా వెల్లడించారు. కశ్మీర్ కు రాజ్యాంగబద్దంగా సంక్రమించిన హక్కుల కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తామన్నారు. రాష్ట్ర విభజన సమయంలో అనేక మందిని జైళ్లలో నిర్భందించారని వారందరినీ భేషరతుగా విడుదల చేయాలి. లద్దఖ్, జమ్మూ కాశ్మీర్ సంక్షేమం కోసం కేంద్ర తీసుకునే ఎలాంటి నిర్ణయాన్నైనా సమర్థిస్తామని ఆయన స్పష్టం చేశారు. కశ్మిరీల సంక్షేమమే గుప్కర్ కూటమి అజెండా అన్నారు.