Friday, March 29, 2024
HomeTrending Newsకాంగ్రెస్, బీజేపీల‌ది కుర్చీ కొట్లాట‌ - హ‌రీశ్‌రావు

కాంగ్రెస్, బీజేపీల‌ది కుర్చీ కొట్లాట‌ – హ‌రీశ్‌రావు

కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కుర్చీ కోసం కొట్లాడుకుంటున్నాయ‌ని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హ‌రీశ్‌రావు నిప్పులు చెరిగారు. ఒక పార్టీలో ఓటుకు నోటు పంచాయితీ ఉంటే.. ఇంకో పార్టీలో సీఎం సీటుకు నోటు పంచాయితీ ఉంద‌ని విమ‌ర్శించారు. కర్ణాటక ముఖ్య‌మంత్రి పదవికి రూ. 2,500 కోట్లు ఇస్తే వస్తద‌ట‌.. ఇది మనం అనడం లేదు. కర్ణాటక బీజేపీ ఎంపీనే చెప్తున్నాడ‌ని హ‌రీశ్‌రావు గుర్తు చేశారు. ఇక కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎవరో మీకు తెలుసు, ఓటుకు నోటు కేసులో ముద్దాయి. ఇలాంటి పార్టీల‌తో తెలంగాణ అభివృద్ధి జ‌రుగుతుందా? అని మంత్రి ప్ర‌శ్నించారు. టీఆర్ఎస్ పార్టీకి మీరే హై కమాండ్. మీరు ఏది కోరుకుంటే అది చేసే పార్టీ. టీఆర్ఎస్ లేకపోతే, సీఎం గా కేసీఆర్ లేకపోతే భూపాల‌ప‌ల్లి జిల్లా అయ్యేదా..? భూపాలపల్లికి మెడికల్ కాలేజీ వచ్చేదా..? అని హ‌రీశ్‌రావు అడిగారు.

జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి జిల్లాలో రూ. 102 కోట్లతో చేప‌ట్టిన ప‌లు ప‌నుల‌కు మంత్రి హ‌రీశ్‌రావు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సంద‌ర్భంగా మంత్రి హ‌రీశ్‌రావు మాట్లాడుతూ.. రూ. 55 కోట్ల వ్య‌యంతో 200 పడకల ఆస్ప‌త్రికి శంకుస్థాప‌న చేశామ‌ని తెలిపారు. రూ. 6 కోట్ల‌తో రేడియోల‌జీ, పాథాల‌జీ ల్యాబ్స్‌ను అందుబాటులోకి తెచ్చుకోనున్నామ‌ని చెప్పారు. ఈ రెండు ల్యాబ్‌ల్లో ఉచితంగా 56 పరీక్షలను నిర్వ‌హించ‌నున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు.

జేపీ న‌డ్డాపై ఫైర్
కాళేశ్వ‌రం ప్రాజెక్టుపై ఇష్ట‌మొచ్చిన‌ట్లు మాట్లాడిన జేపీ న‌డ్డాపై హ‌రీశ్‌రావు తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్, బీజేపీ నాయ‌కులు ఇష్ట‌మొచ్చిన‌ట్లు మాట్లాడుతున్నార‌ని ధ్వ‌జ‌మెత్తారు. కాళేశ్వ‌రం ప్రాజెక్టుతో ఒక్క ఎక‌రానికి కూడా నీరు పార‌లేద‌ని, ఎవ‌రో రాసిచ్చిన స్క్రిప్టును న‌డ్డా చ‌దివారు. కాళేశ్వ‌రం నీళ్లు పంట పొలాల‌కు వ‌స్తున్నాయో, లేదా అనే విష‌యం తెలుసుకోవాలంటే భూపాల‌ప‌ల్లికి రావాలి. త‌మ రైతుల‌ను అడిగితే నీళ్లు వ‌చ్చాయా? లేదా? అన్న‌ది తెలుస్తుంద‌న్నారు. చిట్ట‌చివ‌రి టేకుమ‌ట్ల దాకా నీళ్లు వ‌చ్చాయ‌న్నారు. ఆనాడు నీళ్ల కోసం రైతులు త‌మ క‌ళ్ల‌ల్లో వ‌త్తులేసుకుని ఎదురు చూస్తే.. నేడు నీరు చాలు, ఆపాల‌ని రైతులు కోరుతున్నార‌ని హ‌రీశ్‌రావు తెలిపారు. ద‌మాక్ లేని మాట‌లు న‌డ్డా మాట్లాడార‌ని ధ్వ‌జ‌మెత్తారు. కాళేశ్వ‌రంలో అవినీతి జ‌రిగింద‌ని అన‌డం స‌రికాదు.. ఈ ప్రాజెక్టుతో పంట‌లు విరివిగా పండాయ‌ని తెలిపారు.

కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతుల ఆత్మ‌హ‌త్య‌లు
వ‌రంగ‌ల్ లో కాంగ్రెస్ పార్టీ ప్ర‌క‌టించిన డిక్ల‌రేష‌న్‌పై కూడా హ‌రీశ్‌రావు ఘాటుగా స్పందించారు. ఏడేండ్ల కింద కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని మ‌రిచిపోయారా? ఎరువుల బ‌స్తాల కోసం లైన్ల‌లో నిల్చున్న విష‌యం గుర్తుందా? అని రైతుల‌ను హ‌రీశ్‌రావు అడిగారు. కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్‌ఫార్మ‌ర్లు వారి పాల‌న‌లో ద‌ర్శ‌న‌మిచ్చేవ‌ని గుర్తు చేశారు. ధాన్యం అమ్ముకునేందుకు కూడా రైతులు ఎన్నో క‌ష్టాల‌ను అనుభ‌వించార‌ని పేర్కొన్నారు. క‌రెంట్ కోత‌తో ఇబ్బందులు ప‌డ్డారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతుల ఆత్మ‌హ‌త్య‌లు, ఆక‌లి చావులు అని హ‌రీశ్‌రావు గుర్తు చేశారు. టీఆర్ఎస్ ప్ర‌భుత్వంలో అలాంటి ప‌రిస్థితి లేద‌ని మంత్రి స్ప‌ష్టం చేశారు.

Also Read : స్వగృహ ఫ్లాట్లు అమ్మకానికి సిద్ధం 

RELATED ARTICLES

Most Popular

న్యూస్