Saturday, March 14, 2026
HomeTrending Newsఇమ్రాన్ ఖాన్ పై హత్యాయత్నం

ఇమ్రాన్ ఖాన్ పై హత్యాయత్నం

పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై హత్యాయత్నం జరిగింది. పంజాబ్ రాష్ట్రంలోని గుజ్రన్ వాలాలోని వజీరాబాద్ లో ఇవాళ ర్యాలీ నిర్వహిస్తున్న ఆయనపై దుండగులు కాల్పులు జరిపారు. కాల్పుల్లో ఇమ్రాన్ తో పాటు మరో నలుగురికి గాయాలయ్యాయి. కాల్పుల్లో ఇమ్రాన్ కాలికి గాయమైనట్లు తెలుస్తోంది. దీంతో వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇమ్రాన్ కు చికిత్స చేస్తున్న డాక్టర్లు ఆయనకు ప్రాణాపాయం లేదని చెప్తున్నారు. కాల్పులు జరిపిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పాకిస్తాన్ లో అధికార షాబాజ్ షరీఫ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇమ్రాన్ ఖాన్ లాహోర్ నుంచి ఇస్లామాబాద్ కు లాంగ్ మార్చ్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ గుజ్రన్ వాలాలో ర్యాలీ నిర్వహిస్తున్నారు. దీనికి భారీ ఎత్తున జనం హాజరయ్యారు. ఈ సమయంలో దుండగులు ఆయన్ను టార్గెట్ చేసి కాల్పులు జరిపారు. అప్రమత్తమైన ఆయన సహాయకులు, పార్టీ నేతలు కాపాడే ప్రయత్నం చేసారు. దీంతో వారికి కూడా గాయాలయ్యాయి. వెంటనే ఇమ్రాన్ ఖాన్ ను అక్కడి నుంచి ప్రత్యేక వాహనంలో ఆస్పత్రికి తరలించారు.

2007లో ఇదే తరహాలో పాకిస్తాన్ మరో మాజీ ప్రధాని బేనజీర్ భుట్టో ర్యాలీలోనూ దుండగులు కాల్పులు జరిపి ఆమెను పొట్టనబెట్టుకున్నారు. ఇప్పుడు ఇమ్రాన్ ర్యాలీపైనా దాడి చేసి కాల్పులకు దిగడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. పాకిస్తాన్ మీడియా ఇమ్రాన్ ఖాన్ పై దాడి ఘటనను భుట్టోపై దాడి ఘటనతో పోలుస్తోంది.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular