నీరింకిన నేలలు, తడారిన గొంతులు కరువుదీరా పాడుకోవడానికి విద్వాన్ విశ్వం 1957లో రాసిన కావ్యం- పెన్నేటి పాట. కోటి గుండెల కంజరి కొట్టుకుంటూ పెన్న ఇరుగట్ల జనం వినిపించే విషాద గానమిది. వరుస కరువులకు వందల ఎకరాల సంపన్న భూస్వామి నారపరెడ్డి కొడుకు రంగారెడ్డి…రంగడు అయి చివరికి రామిగాడు అయి…పశువుల కొట్టంలో కూలీ చేసుకుని బతికే దయనీయమైన కథ ఇది. పేరుకు కల్పిత పాత్రే అయినా రాయలసీమలో అప్పటి దయనీయ స్థితికి ఆ పాత్ర ప్రతిరూపం. ఒక కోటీశ్వరుడి కొడుకు పూటకు పట్టెడన్నం దొరక్క గంజి తాగడానికి కరువు ఎలా కారణమయ్యిందో చెప్పిన వాస్తవ చిత్రణ ఇది. ఆ సందర్భంలో పెన్నేటి పాట కావ్యనాయకుడు రంగడు పనిచేసే కలవారి ఇంటిని, వారి వైభోగాన్ని, వారి అభిరుచులను ఇలా వర్ణిస్తున్నాడు కవి.
ఆ ఇంట్లో ఏది కావాలంటే అది ఉంది. ఆ ఇల్లు దాటగానే ఏదీ ఉండదు. అంతా రాళ్లు.
ఆ ఇంట్లో ఎక్కడ చేయి పెట్టినా నగదు, నగలు, కళాఖండాలు. ఆ ఇల్లు దాటితే అంతా మొండి గోడలు.
ఆ ఇంటి ఇనుపపెట్టెల నిండా మూలిగే డబ్బు. ఆ ఇల్లు దాటితే జబ్బు.
ఆ ఇంట్లో ఊరి చెమట సంపదగా కళకళలాడుతూ ఉంటుంది. ఆ ఊరిమీద ఆ ఇంటి భూతం నీడపడి తిరుగుతున్నట్లుంటుంది.

ఆ ఇంటి గోడల నునుపు అద్దమై…ఏది అద్దమో! ఏది గోడో తెలుసుకోలేనంతగా తళతళలతో ప్రతిబింబిస్తూ ఉంటుంది. ఆ ఇంటి పెంపుడు పిల్లి కూడా ఊళ్లో పులిలాంటి పెద్ద రైతును శాసించగలుగుతుంది.
ఆ ఇంట్లో తేన్పులే కానీ…ఆకలి కేకలు, బాధల నిట్టూర్పులు వినపడవు. ఆ ఇంట్లో లక్ష్మి- సరస్వతులు గజ్జెకట్టి నాట్యం చేస్తుంటారు. ఆ ఇంట్లో లేనిది లేదు- మానవహృదయం తప్ప.
ఆ ఇంటి పెద్ద గొప్ప విద్యావంతుడు. ఎప్పుడూ భాగవత పారాయణం చేస్తూ ఉంటాడు. ఆ ఇంటి ఇల్లాలి చల్లని చూపులకే పెరట్లో మల్లెలు పూస్తూ ఉంటాయి. ఆ ఇంటి అబ్బాయి ఇంగ్లాండ్లో ప్రజాస్వామ్యం మీద పరిశోధన చేసి…పట్టా పుచ్చుకుని…వచ్చాడు. ఆ ఇంటి అమ్మాయి ఈమధ్యే సాంఘిక శాస్త్రంలో పట్టా పుచ్చుకుంది. ఆ ఇంట్లో ఏ గోడకు చూసినా వేలాడే చిత్రాలు. ఏ మూల చూసినా అపురూపమైన కళాఖండాలు. ఎక్కడా దుమ్మూధూళి ఉండదు. ఆత్మ తప్ప ఆ ఇంట్లో అన్నీ ఉన్నాయి.
ఊళ్లో మూడొందల మట్టి మిద్దెలు కట్టడానికి అయిన ఖర్చు…ఆ ఇంట్లో ఆరుబయట ఒక అరుగు కట్టిన ఖర్చు కంటే చాలా తక్కువ. ఆ ఊరిని అమాంతం మింగి ఉబ్బినట్లుగా ఆ ఇల్లు ఒక్కటే బలిసి ఉంది.

కావ్యం కాబట్టి ఇదంతా వర్ణన. నిజజీవితంలో ఇలా ఎందుకుంటుందని మనం ఆశ్చర్యపోవాల్సిన పనిలేకుండా…ఎన్ని దశాబ్దాలైనా…ఎన్ని శతాబ్దాలైనా…ఎంతటి సమసమాజ శ్రేయోరాజ్యంలో అయినా ఇలాంటి ఊరినంతా కొండొకచో దేశాన్నంతా మింగి ఉబ్బి ఉండే ఇళ్లు కనిపిస్తూనే ఉంటాయి. నిజానికి ఇలాంటి ఇళ్లు ఇప్పుడు ఊరికొకటి కాదు. లెక్కలేనన్ని. ఒక్కో ఇంటిమీద ఒక్కో పన్నీటి పాటో లేక కన్నీటిపాటో రాయడానికి ఎందరు విద్వాన్ విశ్వమ్ లు పుట్టాలో?
అన్నట్లు-
అంబారీల ఊరేగింపులు సిగ్గుపడేలా భూమ్యాకాశాలు ఒకటి చేస్తూ జరిగిన ఆ అనంత వైభవోజ్వల వివాహం జరిగి ఏడాది అయిన సందర్భంగా దేశవ్యాప్తంగా పత్రికల్లో వచ్చిన వార్తలాంటి ప్రకటన; ప్రకటన లాంటి ఫోటో ఫీచర్ వార్త చదివితే, చిత్రాలు చూస్తే కలిగే చిత్ర విచిత్ర అనుభూతులకు ఏ భాషలో అయినా మాటలు చాలవు!
కొస మెరుపు:-
పెళ్ళిళ్ళల్లో శాశ్వత సమాగమం; పునస్సమాగమం; కార్యం లాంటి మాటలకు అర్థాలు తెలియక ఈ అతిలోక వివాహ తొలి ఏడు పండగ తెలుగు ప్రకటనల్లో వాడారో! తెలిసే వాడారో! తెలియదు. కానీ ఆ తెలుగులో నేరుగా ధ్వనించే అర్థాలను ఎవరైనా పూసగుచ్చినట్లు ఆ ఆది దంపతులకు వివరిస్తే ఎలా ఉంటుందో!

“మహాభారతంలో ఏది ఉందో అదే ప్రపంచంలో ఉంటుంది-
మహాభారతంలో ఏది లేదో అది ప్రపంచంలో ఎక్కడా ఉండదు”– అని ఒక అద్భుతమైన శ్లోకం ఉంది. అలా ఈ తొలి ఏడు పెళ్ళి పండుగ ప్రకటనల ప్రకారం-
“ఈ పెళ్ళిలో ఏది ఉందో అదే ప్రపంచంలో ఉంటుంది- ఈ పెళ్ళిలో ఏది లేదో అది ప్రపంచంలో ఎక్కడా ఉండదు!!”
“పృథివి కలవాడి పృష్ఠంబు పుండయిన జగతి వార్తకెక్కు”- అని ఒక ప్రమాణం. అంటే బాగా డబ్బున్నవాడి పిర్ర మీద చిన్న పుండు లేచినా అది ప్రపంచానికి అతి పెద్ద వార్త అవుతుందట.
పుండే అతి పెద్ద వార్త అయ్యేప్పుడు…ఈ సహస్రాబ్దపు అతి పెద్ద పెళ్ళి పండుగ వార్త కాకుండాపోతే…అది మానవ నాగరికతకే మాయని మచ్చ అయి ఉండేది!
-పమిడికాల్వ మధుసూదన్
9989090018
YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు

