Friday, June 12, 2026
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంమలివయసులో మరో జీవితం

మలివయసులో మరో జీవితం

మీరెప్పుడైనా అహమ్మదాబాద్ వెళ్ళారా? అక్కడి వీధుల్లో స్కూటర్ పై దూసుకుపోయే బామ్మల జంటని చూశారా?… స్నేహం అనే పదం ఒకప్పుడు చాలా పవిత్రంగా, బరువుగా ఉండేది. స్నేహం చేస్తే మోసం చెయ్యకూడదు. జీవితాంతం స్నేహ బంధం కాపాడుకోవాలి … ఇలా అనిపించేది. అయితే చదువు పూర్తి అయి ఉద్యోగంలో చేరినపుడు, అందుకోసం హాస్టల్లో చేరినపుడు ఎదురైన అనుభవాలు స్నేహం పట్ల దృక్పథం మార్చేశాయి. అడుగడుగున స్వార్థం, స్నేహం పేరిట వాడుకోవడం, నిండా ముంచెయ్యడం… ఇలా ఎన్నో. పక్కవారి ప్రతిభను తొక్కేసి తాము ముందుకెళ్లాలనుకునే స్నేహితులు, దేవుడి పేరుచెప్పి దగ్గరై ఆనక గుడిని, గుళ్లో లింగాన్ని మింగాలనుకునే స్నేహితులు తక్కువ లేరు. అయితే మండుటెండలో మలయమారుతంలా పలకరించే స్నేహాలూ లేకపోలేదు. మనసున మనసై మన క్షేమాన్నే కోరుకునే అపురూపమైన స్నేహితులూ ఉంటారు. వారి స్నేహం మనకి సంజీవని. మహిళలకి పెళ్ళయితే స్నేహితులగురించి మరచిపోతారని ఒక అభిప్రాయం సమాజంలో ఉంది. ఇప్పడిప్పుడే ఇది మారుతోంది. స్నేహితులతో గడిపే వారు కనిపిస్తున్నారు.

గుజరాత్ కి చెందిన ఇద్దరు మహిళలు ఈ విషయంలో పాతికేళ్లుగా ఆదర్శంగా నిలుస్తున్నారు. మందాబెన్ షా, ఉషాబెన్ షా అనే స్నేహితురాళ్ళు స్కూటర్ పైన ‘ఏ దోస్తీ హమ్ నహీ ఛో డెంగే ‘ అని అహ్మదాబాద్ వీధుల్లో దూసుకుపోతూ ఉంటారు. వీరిలో మందాబెన్ ప్రస్తుత వయసు 86 ఏళ్ళు. 62 ఏళ్ళ వయసులో స్కూటర్ నడపడం నేర్చుకుంది. ఆమె ప్రియ స్నేహితురాలు ఉష మాత్రం ఎప్పుడూ పిలియన్ రైడరే. ( పక్కన ఉండే తొట్టె లాంటిది). నిజానికి వీళ్ళిద్దరూ చాలారోజులు గుళ్ళకి, మార్కెట్లకు వెళ్ళడానికి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడేవారు. అయితే అలా బస్సులకోసం వేచి చూడడం విసుగ్గా ఉండేది. దాంతో మందాబెన్ వేరే మార్గం ఆలోచించాలని అనుకుంది. ఉష వంతపాడింది. పడుతూ లేస్తూ మందా డ్రైవింగ్ నేర్చుకుంటే చప్పట్లు కొట్టి ఉష ప్రోత్సహించింది.కష్టమే కానీ అదే ఈ మిత్రుల ప్రత్యేకత. ‘ఆ! కొన్నాళ్లే వీళ్ళ ముచ్చట’ అనుకున్నవాళ్ళంతా విస్తుపోయేలా వయసు పెరిగే కొద్దీ ఈ బామ్మల ఉత్సాహం ఇంకా పెరుగుతోంది. రోడ్లన్నీ తమవే అన్నట్టు విహరిస్తూ ఉంటారు. పక్కనుంచి వెళ్లేవారు దృష్టి సారించకుండా, మెచ్చుకోకుండా ఉండలేరు. బస్సు కండక్టర్లు, క్యాబ్ డ్రైవర్లు, షాపులవాళ్ళు ‘ అమ్మా! సూపర్ డ్రైవింగ్’అంటూ ఉంటారు. కొందరు జాగ్రత్తలు చెప్తారు. అన్నిటికీ చిరునవ్వే సమాధానమిచ్చే మందాబెన్ స్కూటర్ తనకి కేవలం వాహనం కాదని, జీవించడానికి అవసరమైన శక్తి, స్వేచ్ఛ, ప్రేరణ ఇచ్చే ఆయుధమని చెప్తారు.

ఇప్పుడు ఈ స్నేహితుల ద్వయం అందరికీ తెలుసు. వారేదో ప్రచారం కోరుకున్నారని కాదు, జీవితాన్ని తమకు నచ్చిన విధంగా మలచుకున్నందుకు. వారు స్కూటర్ పై చేసే ప్రతి ప్రయాణం వార్ధక్యం అంటే ఇతరులపై ఆధారపడటం కాదని అందరికీ గుర్తు చేస్తున్నట్లు ఉంటుంది.

ఎప్పుడన్నా అహ్మదాబాద్ వీధుల్లో వారు మీకు తారసపడితే చూడండి అసలైన ఆనందం ఏమిటో. ఎనభై ల్లో ఉన్న ఇద్దరు మహిళలు కలసి పయనిస్తూ గాలికి ఎగిరే ముంగురులను సరిచేసుకుంటూ జీవితానికి తమదైన భాష్యం చూపడాన్ని తప్పకుండా ఆస్వాదించండి.

-కె.శోభ

YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular