చందమామ కథలో చదివా రెక్కల గుర్రాలుంటాయని… నమ్మడానికి ఎంతో బాగుంది – చాలా పాపులర్ పాట. నిజంగానే కొన్ని ఊహలు చాలా బాగుంటాయి. ఆంజనేయుడు సముద్రాన్ని దాటిన ఘట్టం ఎంతో నచ్చుతుంది. పాండవులు కుంతీదేవికోసం స్వర్గానికి బాణాల నిచ్చెన వేశారంటే కళ్ళ ముందు ఆ దృశ్యం కనిపిస్తుంది. ఆకాశాన్ని అందుకోవడం, చందమామపై అడుగెట్టడం ఒకప్పుడు అసాధ్యం. మానవ మేథ సుసాధ్యం చేసింది. అంతేనా…ఆకాశాన్నంటే భవనాలు, అబ్బురపరిచే ఆకృతులు చాలా సాధారణం. నీటిలో తేలియాడే బోట్ హౌస్ లు, భవనాలు కూడా చూస్తున్నాం. జెఫ్ బెజోస్ వంటి కుబేరులు అంతరిక్ష టూరిజాన్ని కూడా ప్రవేశపెడుతున్నారు. మనం బస్ ఎక్కి ఆఫీస్ కి వెళ్ళేలోపు వాళ్ళు స్పేస్ కి వెళ్లి వచ్చేస్తున్నారు. ఇలా చెప్తే ఆకాశవిహారాలు, విశేషాలు చాలానే ఉన్నాయి.
ఆకాశం, నేల కాకుండా నీటిపైన త్వరలో ఓ మహానగరం వస్తుందనే వార్త అందర్నీ ఆకర్షిస్తోంది. ఇందుకు వేదిక మాల్దీవులు. భూతాపం కారణంగా మంచు కరిగి సముద్రమట్టాలు పెరుగుతున్నాయి. దాంతో ఎన్నో ద్వీపాలు కనుమరుగయ్యే ప్రమాదం పొంచి ఉంది. మాల్దీవులు సముద్ర మట్టానికి ఒక మీటరు ఎత్తులో మాత్రమే ఉన్నాయి. ఏమాత్రం సముద్రమట్టం పెరిగినా ముందు మునిగేది ఈ దీవులే. 300 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణమున్న ఈ దేశ జనాభా అయిదున్నర లక్షలు. దాంతో అక్కడి ప్రభుత్వం ముందే మేలుకుని నీటిపై తేలే నగరం నిర్మించాలని సంకల్పించింది. స్కూళ్ళు మొదలుకుని ఆఫీసులు, షాపింగ్ మాల్స్ తో సహా అన్ని హంగులూ ఉంటాయక్కడ.
ఈ ఇన్నోవేటివ్ ఫ్లోటింగ్ ఐలాండ్ సిటీ ని 200 హెక్టార్ల విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు. షడ్భుజాకారంలో ఒకదానికొకటి ఆనుకున్నట్టుగా భవంతులు నిర్మించడం ద్వారా కెరటాలు విరుచుకు పడేప్రమాదం ఉండదు. నెదర్లాండ్స్ కు చెందిన డచ్ డాక్ ల్యాండ్స్ సంస్థ ఈ నిర్మాణం చేపడుతోంది. అన్నీ అనుకూలిస్తే వచ్చే ఏడాది శంకుస్థాపన, ఐదేళ్లలో గృహప్రవేశం. బాగుందికదా! అన్నట్టు ఒక్కో ఇల్లు ధర కూడా ఎక్కువేం కాదు. మన కోకాపేట భూముల ధర కన్నా తక్కువే. సుమారు కోటి ఎనభై అయిదు లక్షలు. పర్యావరణ హితం కోసం ఇక్కడ కార్లు నిషేధం. ఎలక్ట్రిక్ స్కూటర్లకే ప్రవేశం. ఇన్ని ప్రత్యేకతలున్నాయి కాబట్టే ప్రపంచంలోనే తొలి ‘ఫ్లోటింగ్ సిటీ’ అంటున్నారు. ఓసోస్! మా కృష్ణుడు ద్వారకా నగరం ఎప్పుడో కట్టాడు అంటారా! సముద్రమే తేల్చాలి.
-కె. శోభ