Friday, September 20, 2024
HomeTrending Newsదేశంలో సార్వత్రిక ఎన్నికలకు తొలి నోటిఫికేషన్

దేశంలో సార్వత్రిక ఎన్నికలకు తొలి నోటిఫికేషన్

దేశంలో సార్వత్రిక ఎన్నికలకు తొలి నోటిఫికేషన్ ఈ రోజు విడుదలైంది. ఏప్రిల్‌ 19న పోలింగ్ జరగనున్న లోక్‌సభ తొలి విడత ఎన్నికల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ జారీ చేసింది. తొలి విడతలో భాగంగా 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 102 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 27వ తేది వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. 30న నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజు. ఏప్రిల్‌ 19న 102 నియోజకవర్గాల్లో తొలి విడత పోలింగ్‌ జరగనుంది.

బీహార్‌ మినహా 20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మార్చి 28న నామినేషన్‌ల స్క్యూటినీ నిర్వహించనున్నారు. బీహార్‌లో మార్చి 30న నామినేషన్‌ల స్క్రూటినీ జరగనుంది. తమిళనాడులో 39, రాజస్థాన్‌లో 12, ఉత్తర్‌ప్రదేశ్‌లో 8, మధ్యప్రదేశ్‌లో 6..మహారాష్ట్ర, ఉత్తరాఖండ్‌, అసోంలో 5 స్థానాలకు తొలి విడతలో పోలింగ్‌ జరుగుతుంది. పశ్చిమ బెంగాల్‌లో 3, అరుణాచల్‌ ప్రదేశ్‌, మణిపుర్‌, మేఘాలయాల్లో 2..ఛత్తీస్‌గఢ్‌, మిజోరం, నాగాలాండ్‌, సిక్కిం, త్రిపుర..అండమాన్‌ నికోబార్‌, జమ్ముక‌శ్మీర్‌, లక్షద్వీప్‌, పుదుచ్చేరిల్లో ఒక్కో స్థానానికి పోలింగ్‌ నిర్వహిస్తారు.

దేశంలో మొత్తం 7 దశల్లో లోక్‌సభ పోలింగ్ జరుగుతుండగా..ఏప్రిల్ 19, ఏప్రిల్ 26, మే 7, మే 13, మే 20, మే 25, జూన్ 1న ఎన్నికల పోలింగ్ ఉంటుంది. జూన్ 4న ఓట్లు లెక్కింపు జరుపుతారు. దేశంలో మొత్తం 96 కోట్ల 88 లక్షల మంది ఓటర్లు ఉండగా.. పురుషులు 49 కోట్లు, మహిళలు 47కోట్లు, కోటి 80 లక్షల మంది కొత్త ఓటర్లు ఓటు హక్కు వినియోజ్గించుకుంటారు.

ఎన్నికల కోసం 55 లక్షల ఈవీఎంలు సిద్దం చేశారు. 10లక్షల 50వేల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. కోటి 50లక్షల మంది పోలింగ్ అధికారులు, భద్రతా సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటారు. తొలి విడతలోనే తమిళనాడులోని మొత్తం స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు.

తెలంగాణ గవర్నర్ పదవికి రాజీనామా చేసిన తమిళిసై సౌందర్ రాజన్ ఈ రోజు(బుధవారం) బిజెపిలో చేరారు. 20 ఏళ్లకు పైగా రాజకీయాల్లో చురుకుగా ఉన్న తమిళిసై.. బీజేపీలో క్రియాశీలకంగా పనిచేశారు. 2019 పార్లమెంట్‌ ఎన్నికల్లో దక్షిణ చెన్నై పార్లమెంట్‌ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం ఆమెను కేంద్రం తెలంగాణకు గవర్నర్‌గా నియమించింది. 2019 సెప్టెంబర్‌ 8న తెలంగాణ గవర్నర్‌గా తమిళిసై నియమితులయ్యారు. ఆ తర్వాత పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా కూడా అదనపు బాధ్యతలు చేపట్టారు. ప్రత్యక్ష రాజకీయాలంటే ఇష్టమున్న ఆమె.. లోక్‌సభ ఎన్నికలకు ముందు గవర్నర్‌ పదవికి రాజీనామా చేశారు. చెన్నై సెంట్రల్ లేదా తుత్తుకూడి  ఎంపీ స్థానం నుంచి త‌మిళిసై పోటీ చేసే అవ‌కాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు తుత్తుకూడి నుంచి DMK అభ్యర్థిగా కనిమొలి బరిలోకి దిగుతున్నారు.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్