Dadishetti Raja: బాబు, రజని క్షమాపణ చెప్పాలి: రాజా డిమాండ్

మొన్న విజయవాడలో జరిగింది ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల సభ కాదని, చంద్రబాబుకు భజన  కోసం పెట్టిన సభ అని  రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖా మంత్రి దాడిశెట్టి రాజా వ్యాఖ్యానించారు. ఆ సభలో బాలకృష్ణ, మరో ఇద్దరు ముగ్గురు మినహా ఎన్టీఆర్ కుటుంబ సభ్యులెవరూ లేరని, ముఖ్యంగా ఎన్టీఆర్ సినిమా లెగసీని ముందుకు తీసుకెళ్తున్న జూనియర్ ఎన్టీఆర్ ను కూడా పిలవలేదని ఆక్షేపించారు. వైసీపీ నేతలు రజనీకాంత్ పై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని,  ఎన్టీఆర్ ను వెన్నుపోటు పోడిచినందుకు చంద్రబాబు, రజనీకాంత్ లు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.  రజనీకాంత్ ను మొన్నటి వరకూ ఓ లెజండరీ పర్సన్ అనే తాము అనుకున్నామని, కానీ వెన్నుపోటు ఎపిసోడ్ లో ఆయన పాత్ర కూడా ఉందని ఈ మధ్యే తెలిసిందన్నారు. బాబును సమర్ధించిన ఆయన ఎప్పటికీ లెజెండ్ కాబోరని స్పష్టం చేశారు. కేవలం ఎన్నికలప్పుడే బాబుకు ఎన్టీఆర్ గుర్తుకు వస్తారని విమర్శించారు. గత ఎన్నికల సమయంలో బాబు- ఏబీఎన్ రాధాకృష్ణ సంభాషణ రాష్ట్రమంతటా విన్నారని గుర్తు చేశారు. అవినీతి, దోచుకోవడం, దాచుకోవడమే బాబు విజన్ అని… బాబు ఇప్పుడే వృద్దాప్యంలో ఉన్నారని, 2047 విజన్ అంటే  ఎలా సాధ్యమని ప్రశ్నించారు.

చంద్రబాబు-పవన్ భేటీపై రాజా స్పందించారు. వారిద్దరూ ఇప్పడు కొత్తగా కలవడం ఏమిటని 2014 నుంచే కలిసి ఉన్నారని, కలిసే పయనిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో వారు మరోసారి కలిసి పోటీ చేస్తారని జోస్యం చెప్పారు.  వారిద్దరిదీ ఫ్లాప్ కాంబినేషన్ అని అభివర్ణించారు. ఈ రెండు పార్టీలే కాదని బిజెపి, కాంగ్రెస్, వామపక్షాలు అందరూ కలిసి రావచ్చని ఎద్దేవా చేశారు. ఎవరు కలిసి వచ్చినా ప్రజలు మాత్రం జగన్ ను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *