Saturday, November 23, 2024
HomeTrending Newsతెలంగాణకు మరో రెండు అంతర్జాతీయ కంపెనీలు

తెలంగాణకు మరో రెండు అంతర్జాతీయ కంపెనీలు

Fisker : ప్రపంచ ఎలక్ట్రిక్ వాహన రంగంలో మరొక ప్రముఖ కంపెనీ ఐన ఫిస్కర్ , హైదరాబాద్ లో ఐటి, డిజిటల్ డెవలప్మెంట్ సెంటర్ ను ఏర్పాటు చేయబోతుంది. గత కొంత కాలంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో ఇందుకోసం సంప్రదింపులు జరుపుతున్న కంపెనీ ఈరోజు అధికారికంగా ప్రకటించింది. లాస్ ఏంజెల్స్ లోని ఆ కంపెనీ ప్రధాన కార్యాలయంలో సీఈఓ హెన్రీక్ ఫిష్కర్, సియఫ్ వో గీతా ఫిస్కర్ లతో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. రానున్న రోజుల్లో ఎలక్ట్రిక్ వాహన పరిశ్రమకు తెలంగాణనే గమ్యస్థానంగా మారబోతుందని, ఇందుకు అవసరమైన అన్ని చర్యలను తమ ప్రభుత్వం తీసుకుందని ఫిస్కర్ ప్రతినిధులకు మంత్రి కేటీఆర్ వివరించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈవీ పాలసీపై చర్చించారు. హైదరాబాద్ కేంద్రంగా పలు కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేస్తున్నాయన్నారు. ఇక జఢ్ ఎఫ్, హ్యుండై వంటి పలు కంపెనీలు హైదరాబాద్ కేంద్రంగా తమ టెక్ కార్యకలాపాలను నిర్వహిస్తున్న విషయాన్ని ఈ సమావేశంలో కేటీఆర్ ప్రస్తావించారు. ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగాన్ని ప్రాధాన్యత రంగంగా గుర్తించామన్నారు. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ పరిశ్రమకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామన్నారు కేటీఆర్. ఆటో మొబైల్ కి పరిశ్రమకు సంబంధించిన డిజైన్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కు హైదరాబాద్ లో అద్భుతమైన అవకాశాలున్నాయన్న కేటీఆర్, ఇందుకోసం ప్రత్యేకంగా మొబిలిటీ క్లస్టర్ ని త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. అందులో భాగస్వాములు కావాలని ఫిస్కర్ కంపెనీని కోరారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటుచేయబోయే మొబిలిటీ క్లస్టర్ లో భాగస్వాములయ్యేందుకు అంగీకరించారు.

తమ ఐటి, డిజిటల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటుకు సంబంధించి ప్రపంచంలోని అనేక దేశాలు, ఇండియాలోని ఇతర రాష్ట్రాలను కూడా పరిశీలించామని, అయితే తెలంగాణలోని పారిశ్రామిక అనుకూలత, ప్రభుత్వ పారదర్శక విధానాలే హైదరాబాదులో సెంటర్ ఏర్పాటు చేయాలన్న తమ నిర్ణయానికి ప్రధాన కారణమని సీఈఓ హెన్రీక్ ఫిష్కర్ చెప్పారు. ఈ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటుతో ఆటో మొబైల్, సాఫ్ట్వేర్ రంగాలకు చెందిన 300 మంది టెక్ నిపుణులకు ఉద్యోగావకాశాలు దొరుకుతాయన్నారు. భవిష్యత్తులో దీన్ని మరింతగా విస్తరించి, మరికొంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. ఈ సందర్భంగా తమ పరిశోధన, ఇంజనీరింగ్ కార్యకలాపాలకు సంబంధించిన వివరాలను కంపెనీ సీనియర్ ప్రతినిధి బృందం మంత్రి కే. తారకరామారావుకు అందజేశారు. ఫిష్కర్ కంపెనీ తయారు చేసిన ఓషన్ మోడల్ ఎలక్ట్రిక్ కారును మంత్రి కేటీఆర్ పరిశీలించారు.

మంత్రి కేటీఆర్ తో జరిగిన సమావేశంలో తన డిజిటేక్ సెంటర్ ఏర్పాటును ప్రకటించిన క్యాలవే (Callaway) గోల్ఫ్ కంపెనీ

గోల్ఫ్ క్రీడకు చెందిన ప్రతిష్టాత్మక కంపెనీ క్యాలవే (Callaway) హైదరాబాద్ లో తన డిజిటల్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకుంది. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన గోల్ఫ్ బ్రాండ్స్ ఒడిసి, ట్రవిస్ మాథ్యూ, ఓజియో, జాక్ వోల్ఫ్ స్కిన్ లను కలిగి ఉన్న క్వాలవే వార్షికాదాయం 3.2 బిలియన్ డాలర్లు. ఈ డిజిటెక్ సెంటర్ తో గోల్ఫ్ క్రీడకు సంబందించిన డేటా అనలిటిక్స్ తో పాటు తన గ్లోబల్ కార్యకలాపాలకు సపోర్టు ను, టెక్ సొల్యూషన్స్ ను అందించేందుకు ఈ డిజిటెక్ సెంటర్ ను ఏర్పాటు చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ డిజిటెక్ సెంటర్ తో గోల్ఫ్ ఆటగాళ్ల ఆటతీరుతో సహా వారి క్రీడా నైపుణ్యం, దాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలనే విషయానికి సంబంధించి ఎదురయ్యే అనేక సమస్యలకు టెక్నాలజీ ఆధారిత పరిష్కారాలను తమ కంపెనీ సూచిస్తుందని తెలిపింది. లాస్ ఏంజలెస్ కి దగ్గరలో వున్న కాల్స్ బాద్ నగరంలో మంత్రి కే తారకరామారావు, కాల్ వే కంపెనీ కార్యనిర్వాహక ఉపాధ్యక్షులు, సి ఎఫ్ వో బ్రయన్ లించ్, సి ఐ వో సాయి కూరపాటి లతో సమావేశం అయ్యారు. అమెరికా తర్వాత హైదరాబాద్ లో ఏర్పాటుచేయబోయే సెంటరే అతిపెద్దదని కంపెనీ ప్రతినిధులు చెప్పారు. డిజిటెక్ సెంటర్ ఏర్పాటుతో తొలి దశలో అత్యంత నైపుణ్యం కలిగిన 300 మంది సాఫ్ట్వేర్ రంగ నిపుణులకు ఉపాధి దొరుకుతుందన్నారు. పెట్టుబడికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే చేస్తామన్నారు క్వాలవే ప్రతినిధులు.

ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్రంలో క్రీడా టూరిజం మరియు క్రీడా అగ్రి తయారీ వంటి అంశాలను చర్చించారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ మరియు చీఫ్ రిలేషన్ ఆఫీసర్ అమర్నాథ్ రెడ్డి ఆత్మకూరి, డిజిటల్ మీడియా డైరెక్టర్ దిలీప్ కొనతం తదితరులు పాల్గొన్నారు

క్వాల్కమ్ హైదరాబాద్
సాఫ్ట్ వేర్, వైర్ లెస్ టెక్నాలజీ, సెమికండక్టర్ రంగాల్లో అంతర్జాతీయ దిగ్గజంగా పేరుపొందిన క్వాల్కమ్ సంస్థ ప్రపంచంలోనే తమ రెండో అతిపెద్ద కార్యాలయాన్ని హైదరాబాద్ లో త్వరలో ప్రారంభించనున్నట్లు తెలిపింది. అమెరికా పర్యటనలో ఉన్న ఐటీ శాఖ మంత్రి కే.తారకరామారావు ఇవాళ శాండియాగోలోని క్వాల్కమ్ కంపెనీ ప్రధాన కార్యాలయంలో సంస్థ సి ఎఫ్ వో ఆకాష్ పాల్కివాల, ఉపాధ్యక్షులు జేమ్స్ జిన్, లక్ష్మి రాయపూడి, పరాగ్ అగాసే, డైరెక్టర్ దేవ్ సింగ్ వంటి సీనియర్ ప్రతినిధి బృందం ఈరోజు మంత్రి కేటీఆర్ తో సమావేశమైంది

హైదరాబాద్ నగరంలో వివిధ దశల్లో 3904.55 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈ కేంద్రాన్ని ప్రారంభించబోతున్నట్లు తెలిపిన క్వాల్కమ్, మంత్రి కేటీఆర్ తో తన పెట్టుబడి ప్రణాళికలను పంచుకుంది. నగరంలో అందుబాటులో ఉన్న నైపుణ్యం కలిగిన మానవ వనరులు ప్రభుత్వ పాలసీలు తమ కంపెనీని నిరంతరం తెలంగాణలో విస్తరించేలా ప్రభావితం చేస్తున్నాయని ఈ సందర్భంగా తెలిపింది.

రానున్న ఐదు సంవత్సరాల్లో హైదరాబాద్ లో భారీగా పెట్టుబడి పెడతామన్న క్వాల్కమ్ సంస్థ, తమ విస్తరణతో 8700 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించడంతో పాటు సుమారు 15 లక్షల 72 వేల ఎస్.ఎఫ్. టి కార్యాలయం అందుబాటులోకి వస్తుందందని తెలిపింది. పెట్టుబడికి సంబంధించిన ప్రక్రియ ఇప్పటికే ప్రారంభించామని, అక్టోబర్ నెల నాటికి హైదరాబాద్ లో తమ కేంద్రం రెడీ అవుతుందని క్వాల్కమ్ తెలిపింది.


భవిష్యత్తులో సెమీకండక్టర్ చిప్ తయారీ వంటి రంగాల్లో తెలంగాణను మరింత ఆకర్షణీయ గమ్యస్థానంగా మార్చేందుకు క్వాల్కమ్ సంస్థ పెట్టుబడి ఉపయోగపడుతుందన్న ఆశాభావాన్ని మంత్రి కేటీఆర్ వ్యక్తం చేశారు. సాఫ్ట్ వేర్ తో పాటు వ్యవసాయ, విద్యా రంగాల్లో తెలంగాణలో ఉన్న అపార అవకాశాలను అందిపుచ్చుకోవడమే తమ విస్తరణ ప్రణాళిక ప్రధాన లక్ష్యమని కంపెనీ ప్రతినిధులు మంత్రి కేటీఆర్ కు తెలిపారు. అగ్రిటెక్, విద్యారంగం, కనెక్టెడ్ డివైస్ ల వినియోగం, స్మార్ట్ సిటీ కార్యక్రమాల్లో భాగం కావడానికి తాము సిద్ధంగా ఉన్నట్టు మంత్రికి వివరించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్