High Priority To Girls Education In Telangana :

గిరిజనుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ అన్నారు. బడ్జెట్లో గిరిజన ఆవాసాలకు లింకు రోడ్ల కోసం 1000 కోట్ల రూపాయలు, గిరిజన గ్రామపంచాయతీ భవనాల నిర్మాణానికి 600 కోట్ల రూపాయలు, డబల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం 1700 కోట్ల రూపాయలు కేటాయించారని చెప్పారు. వీటితోపాటు విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ 7 తరగతి నుంచి 12వ తరగతి వరకు చదివే బాలికలకు హెల్త్ అండ్ హైజీన్ కిట్లు ఇచ్చారన్నారు. రక్తహీనతతో బాధపడుతున్న మహిళల ఆరోగ్య పెంపు కోసం 9 జిల్లాలో న్యూట్రిషన్ కిట్లు కూడా ఇస్తున్నామన్నారు.

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా, మేడ్చల్ మండలం, సోమారం గ్రామంలో నేడు 4 కోట్ల 20 లక్షల రూపాయలతో నిర్మించనున్న బాలికల గురుకుల పాఠశాల భవనానికి మంత్రి చామకూర మల్లారెడ్డితో కలిసి మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ శంకుస్థాపన చేశారు.

గత ఏడాది 2 కోట్ల 20 లక్షల రూపాయలతో పోస్ట్ మెట్రిక్ హాస్టల్ ఏర్పాటు చేసుకున్నామన్నారు. ఈరోజు బాలికల గురుకుల పాఠశాల భవనానికి శంకుస్థాపన సందర్భంగా మంత్రి మల్లారెడ్డి అడిగినట్లు బంజారా భవన్ కు కోటిన్నర రూపాయలు, ఆశ్రమ పాఠశాల భవనానికి 3 కోట్ల రూపాయలు, ఈ నియోజకవర్గంలో కొత్తగా ఏర్పడిన 8 గ్రామపంచాయతీల భవన నిర్మాణానికి 2 కోట్ల రూపాయలను మంజూరు చేస్తున్నానని చెప్పడానికి సంతోషం వ్యక్తం చేస్తున్నానన్నారు.

సమావేశంలో మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ మాటలు….

తెలంగాణ వచ్చిన ఈ 7 ఏళ్లలో రాష్ట్రంలో 1000 గురుకులాలను బిసి, ఎస్సి, ఎస్టీ, మైనారిటీల కోసం ఏర్పాటు చేయడం అంటే విద్య పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం. విద్య ద్వారానే వికాసం లభిస్తుందని నమ్మిన ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యధిక గురుకులాలు పెట్టి ఈరోజు పేద వర్గాలకు మంచి విద్యను అందిస్తూ, నాణ్యమైన భోజనం ఇస్తూ వారి అభివృద్ధికి కృషి చేస్తున్నారు. గిరిజన సంక్షేమ శాఖలో గురుకులాలతో పాటు 340 ఆశ్రమ పాఠశాలలు, 1400 కు పైగా గిరిజన ప్రాంతాల్లోని పంచాయతీ పాఠశాలలను నడుపుతూ గిరిజనుల విద్యాభివృద్ధి కోసం కృషి చేస్తున్నాం.

దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో కేజీ నుంచి పీజీ వరకు విద్య అమలు జరుగుతోంది. ఇందులో ప్రత్యేకంగా గిరిజనుల కోసం సైనిక్ స్కూల్, లా కోర్సు, ఇంటీరియర్ డిజైనింగ్, ఫ్యాషన్ డిజైనింగ్, ఫోటోగ్రఫీ, ఫైన్ ఆర్ట్ కోర్సులు, ఆదిమ జాతి గిరిజన తెగల కోసం సెంటర్ ఆఫ్ ఎక్స లెన్స్ విద్యాలయాలు నిర్వహిస్తున్నాం. పోటీ పరీక్షలలో కూడా గిరిజన విద్యార్థులు విజయవంతం కావాలని ఐఏఎస్ స్టడీ సర్కిల్ పెట్టి సివిల్స్ కోసం, గ్రూప్స్ కోసం, అదేవిధంగా నీట్,జేఈఈ వంటి ప్రతిష్ఠాత్మక పోటీ పరీక్షలకు కూడా శిక్షణ ఇస్తున్న ప్రభుత్వం ఇది. భారతదేశంలో కాకుండా విదేశాల్లో కూడా చదువుకోవాలనుకునే విద్యార్థులకు అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకం కింద 20 లక్షల రూపాయలను ఇస్తూ విదేశీ విద్యను ప్రోత్సహిస్తోంది.

తెలంగాణ ప్రభుత్వం వచ్చాక గిరిజనుల సుదీర్ఘ డిమాండ్ తండాలను గ్రామ పంచాయతీలు చేయాలన్నది నిజం చేసి, తండాలలో గిరిజనులు సర్పంచ్ గా పాలించుకునే అవకాశం కల్పించారు. మారుమూల తండాలలో కూడా గ్రామ పంచాయతీ భవనాలు ఉండాలని ఒక్కొక్క దానికి 25 లక్షల చొప్పున ఈ బడ్జెట్లో 2400 భవనాల కోసం 600 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. ఈ నియోజకవర్గంలో కూడా కొత్తగా ఏర్పడిన గ్రామపంచాయతీలకు భవనాల కోసం 2 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేస్తాం. అదేవిధంగా సేవాలాల్ భవనం కోసం ఆరు ఎకరాలు మంత్రిగారు మల్లా రెడ్డి గారు ఇచ్చిన నేపథ్యంలో భవన నిర్మాణానికి కోటిన్నర రూపాయల నిధులను కూడా మంజూరు చేస్తాం.

అదేవిధంగా ఆశ్రమ పాఠశాలలో విద్యాభ్యాసం కావాలి అనుకునే ప్రతి గిరిజనుడికి కాదనకుండా అడ్మిషన్లు ఇస్తున్నాం. ఇప్పటికే లక్షా 30 వేల మంది గిరిజనులు ఆశ్రమ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్నారు. ఆశ్రమ పాఠశాలలో కూడా ఈ విద్యాసంవత్సరం నుంచి ఆంగ్ల బోధన చేస్తున్నాం. ఇక్కడ ఆశ్రమ పాఠశాల భవనం కోసం 3 కోట్ల రూపాయలు కావాలి అని మంత్రిగారు కోరిన నేపథ్యంలో ఆ మూడు కోట్ల రూపాయలకు కూడా మంజూరు ఇస్తామని తెలియజేస్తున్నాను.

మంత్రి మల్లా రెడ్డికి మంచి మనసు, డబ్బు రెండు ఉన్నాయి. ఏ పని చేసినా నిజాయితీతో చేస్తారు. అందువల్ల విద్యా సంస్థల అధిపతిగా, రాజకీయాల్లో ఎంపీగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా కూడా విజయవంతం అవుతున్నారు. అంతేగాకుండా భగవంతుడి అనుగ్రహంతో వారికి ఇటీవలే యూనివర్సిటీ కూడా వచ్చింది. ఈ ఏడాది రాష్ట్రంలోని ఏడు యూనివర్సిటీలలో మహిళల కోసం 10 కోట్ల రూపాయలు, పురుషుల కోసం 10 కోట్ల రూపాయలతో 14 బ్లాకుల వసతి గృహాలు నిర్మించుకునేందుకు 140 కోట్ల రూపాయలను ఈ బడ్జెట్లో కేటాయించడం జరిగింది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *