ఉక్రెయిన్ డ్రోన్ దాడులు చేపట్టడాన్ని ఉగ్రవాద చర్యగా అభివర్ణించిన రష్యా ఈ దాడులను తీవ్రంగా ఖండించింది. మాస్కో సహా రాజధాని పరిసర ప్రాంతాలపై ఉక్రెయిన్ డ్రోన్ దాడిని ప్రారంభించిందని రష్యా మంగళవారం తెలిపింది. దీంతో ఇది రాజధానిలోని ప్రధాన విమానాశ్రయాలలో ఒకదానిలో విమానాలకు అంతరాయం కలిగించిందని పేర్కొంది. మాస్కో ప్రాంతంలో క్రెమ్లిన్‌కు నైరుతి దిశలో కేవలం 30 కిమీ దూరంలో ఉన్న ప్రాంతాల్లోని గగనతలంలో కనీసం మూడు డ్రోన్‌లను అడ్డగించినట్టు రష్యన్ మీడియా పేర్కొంది.
సమీప ప్రాంతంలో మరో డ్రోన్‌ను గుర్తించారు. డ్రోన్‌ల కలకలంతో మాస్కోలోని వ్నుకోవో విమానాశ్రయంలో గంటల పాటు విమానాల ల్యాండింగ్, టేకాఫ్‌లు నిలిచిపోయాయి. పలు విమానాలను ఇతర ఎయిర్‌పోర్టులకు దారిమళ్లించారు. ఎయిర్‌పోర్ట్ సహా పౌర మౌలిక సదుపాయాలున్న ప్రాంతంలో ఉక్రెయిన్ చేపట్టిన దాడి మరో ఉగ్రవాద చర్యేనని రష్యా విదేశాంగ శాఖ ప్రతినిధి మరియ జఖరొవ స్పష్టం చేశారు.