మాజీ ముఖ్యమంతి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడును ఏపీ సిఐడి పోలీసులు అరెస్టు చేశారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో అదుపులోకి తీసుకుంటున్నట్లు నోటీసుల్లో పేర్కొన్నారు. తాము బెయిల్ ఇవ్వలేమని, కోర్టును ఆశ్రయించాలని సూచించారు. రాయలసీమ పర్యటనలో భాగంగా బాబు గత రాత్రి నంద్యాలలో జరిగిన బహిరంగ సభ అనతరం స్థానిక ఆర్కే ఫంక్షన్ హాల్ లో బస చేశారు. గత అర్ధరాత్రి పోలీసులు వచ్చి నోటీసులు ఇచ్చారు. తనను ఎందుకు అరెస్టు చేస్తున్నారో చెప్పాలని, పైగా ఈ కేసును విచారిస్తున్న అధికారి రాకుండా పర్యవేక్షణ అధికారి అరెస్టు చేసేందుకు రావడం ఏమిటని ప్రశ్నించారు. టిడిపికి చెందిన పలువురు న్యాయవాదులు సైతం నోటీసులపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
చివరకు ఈ ఉదయం ఏడున్నర గంటల ప్రాంతంలో బాబును అరెస్టు చేసి విజయవాడకు తరలిస్తున్నారు. బాబుపై సీఆర్ పీసీ సెక్షన్ 50(1) సీఐడీ డీఎస్పీ ధనుంజయుడునోటీసులు ఇచ్చారు. \1988 ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ చట్టం కింద అరెస్ట్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఆయనపై 120 (బి), 166, 167, 418, 420, 465, 468, 471, 409, 201, 109, రెడ్ విత్ 34, 37 ఐపిసి సెక్షను నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటివరకూ 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. చంద్రబాబు హయాంలో స్కిల్ డెవలప్ మెంట్ కుంభకోణం చోటు చేసుకుంది. షెల్ కంపెనీల ద్వారా రూ.241 కోట్ల కుంభకోణం జరిగినట్లు నిర్ధారించారు. డిజైన్ టెక్ సంస్థకి చెందిన రూ.31 కోట్లు ఆస్తులు ఈడీ అటాచ్ చేసింది. ఈ కేసులో బాబు పీఏ శ్రీనివాస్ ,మనోజ్ పార్ధసాని, యోగేష్ గుప్తాలకు నోటీసులు అందించారు.