సమైఖ్య ఆంధ్ర ప్రదేశ్ చివరి డిజిపిగా పనిచేసిన ఐపిఎస్ అధికారి బి. ప్రసాదరావు అమెరికాలో కన్నుమూశారు. అయన అమెరికాలో కుమారుడు వికాస్ వద్ద ఉంటున్నారు. అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో తనకు ఛాతిలో నొప్పిగా వుందని కుటుంబ సభ్యులకు తెలిపారు, అంబులెన్సు ను పిలిపించి ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు ప్రకటించారు.
తెలంగాణా ఉద్యమ సమయంలో హైదరాబాద్ నగర పొలీస్ కమిషనర్ గా, ఆ తర్వాత డిజిపి గా అత్యంత సమన్వయంతో పనిచేశారు. 2013 సెప్టెంబర్ 30న ఆంధ్ర ప్రదేశ్ డిజిపిగా బాధ్యతలు స్వీకరించారు.
గుంటూరు జిల్లాకు చెందిన ప్రసాద రావు ప్రాధమిక విద్యను నరసరావుపేట, కొల్లూరు లో అభ్యసించారు. మొదటి నుంచి భౌతిక శాస్త్రం పై ఆసక్తి కలిగి వుండేవారు. విజయవాడ ఆంధ్ర లయోలా కాలేజ్ లో బిఎస్సి పూర్తి చేశారు. మద్రాస్ ఐ ఐ టి లో ఎమ్మెస్సీ(భౌతిక శాస్త్రం) చేశారు. సౌమ్యుడైన పొలీస్ అధికారిగానే కాకుండా విద్యావేత్తగా, రచయితగా అనేక రంగాల్లో ప్రావీణ్యం పొందారు.
ప్రసాదరావు మృతిపట్ల ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు, అయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.