ఈటల రాజేందర్ మాటలు హద్దులు దాటుతున్నాయని, గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను  బానిస అనడం భావ్యం కాదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. ఇలాంటి మాటలు ఈటల అహంకారానికి నిదర్శనమన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మీడియాతో మాట్లాడిన మంత్రి తలసాని ఈటెల రాజేందర్ వ్యాఖ్యల్ని తప్పు పట్టారు. ఈటల ముందు గెల్లు చిన్న పిల్లవాడు కావచ్చు. ఆ నాడు ఈటల కూడా ముద్దసాని దామోదర్ రెడ్డి ముందు చిన్నవాడే అనే విషయం మరచి పోవద్దన్నారు.

ఈటెల హుజురాబాద్ లో బీసీ శామీర్పేటలో ఓసి అని విమర్శించారు. హుజురాబాద్ ప్రజలు ఈటలకు గుణపాఠం చెబుతారు. ఉద్యమకారులకు టిఆర్ఎస్ ప్రాధాన్యతనిస్తుంది గతంలో సుమన్,కిశోర్ లాంటి వాళ్ల కు పార్టీ అవకాశం కల్పించింది. గెల్లు శ్రీనివాస్ కు కూడా అదేవిధంగా కేసీఆర్ ప్రాధాన్యతనిచ్చారన్నారు. జానా రెడ్డికి  పట్టిన గతే ఈ ఉప ఎన్నికల్లో ఈటలకు పడుతుందని, గతంలో ఆరు సార్లు కెసిఆర్ దయాదాక్షిణ్యాల పైన ఈటల విజయం సాధించారన్నారు.

బీజేపీ నేతలు ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయటం మానుకోపోతే తెరాస శ్రేణులు తగిన రీతిలో బుద్ది చెపుతారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *