Sunday, January 19, 2025
HomeTrending Newsబిజెపికి మోత్కుపల్లి రాం.. రాం...

బిజెపికి మోత్కుపల్లి రాం.. రాం…

మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేశారు. ముఖ్యమంత్రి కెసిఆర్ త్వరలో తీసుకురాబోతున్న దళితబంధు పథకాన్ని సమర్థిస్తూ మోత్కుపల్లి ప్రకటనలు చేయటం ఇటీవల బీజేపీ లో కలకలం సృష్టించింది. కొద్ది రోజుల క్రితం దళిత బంధుపై ప్రగతిభవన్ లో కెసిఆర్ అఖిలపక్ష సమావేశం నిర్వహించారు.  అఖిల పక్ష సమావేశాన్ని బిజెపి రాష్ట్ర శాఖ బహిష్కరించగా, మోత్కుపల్లి నర్సింహులు మాత్రం హాజరయ్యారు. దీనిపై పార్టీ నేతలు వివరణ కోరగా దళితుల కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రవేశపెడుతున్న పథకానికి సలహాలు, సూచనలు ఇవ్వాల్సింది పోయి, బహిష్కరించటం సరికాదని మోత్కుపల్లి ఘాటుగా స్పందించారు.

బీజేపీ రాష్ట్ర నాయకత్వం కెసిఆర్ ఏ పని మొదలుపెట్టినా రాజకీయ కోణంలో విమర్శలు చేయటం, తీవ్రస్థాయిలో ఆరోపణలు చేయటం కొన్నాళ్ళ నుంచి ఎక్కువగా జరుగుతోంది. అదే వైఖరితో దళితబంధు అఖిల పక్ష సమావేశాన్ని పార్టీ బహిష్కరించింది. ఆ సమావేశంలో పాల్గొనటం, పార్టీ వివరణ కోరటం దగ్గర నుంచి మోత్కుపల్లి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. బీజేపీలో చేరినప్పటి నుంచి మోత్కుపల్లి శక్తి వంచన లేకుండా తన వంతుగా పార్టీ బలోపేతం చేసేందుకు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. సాధారణ ఎన్నికల నుంచి నాగార్జునసాగర్ ఎన్నికల వరకు క్రియాశీలకంగా సేవలందించారు. సాగర్ ఎన్నికల సమయంలో కరోనా బారిన పడి ప్రాణపాయ స్థితికి చేరుకున్నారు. చాలా రోజులు యశోద ఆస్పత్రి ఐసియు లో ఉండి క్రమంగా కోలుకున్నారు.

తను ఉన్న పార్టీని విమర్శిస్తే మోత్కుపల్లి ఒంటికాలి మీద లేస్తారు. మోత్కుపల్లి దూకుడును తెలంగాణ ఉద్యమ సమయంలో చంద్రబాబు చాలా తెలివిగా వాడుకున్నారు. నిరంతరం కెసిఆర్ ను విమర్శించటంతో ప్రజల్లో కొంత పలుచన అయ్యారు కూడా. తెలంగాణ వచ్చిన తర్వాత ఆలేరు నుంచి పోటీ చేసినా ఓటమి తప్పలేదు. అదే సమయంలో కెసిఆర్ తెరాసలోకి మోత్కుపల్లి ని ఆహ్వానించినా వెళ్లలేదని, గవర్నర్ పదవి వస్తుందని నమ్మించి చంద్రబాబు కాలయాపన చేశారని సన్నిహితులు అంటున్నారు. ఆ తర్వాత బిజెపిలో చేరినా అక్కడి వాతావరణం మోత్కుపల్లికి సెట్ కాదని మొదటి రోజు నుంచే ఆయన అనుచరులు చెపుతున్నారు. పార్టీ రెండోసారి గెలిచాక నామినేటెడ్ పదవి వస్తుందని ఆశించినా నిరాశే ఎదురయ్యింది. పార్టీలో చేరినప్పటినుంచి పార్టీలో ఎలాంటి పదవి లేదు, కేంద్ర ప్రభుత్వంలో నామినేటెడ్ పదవి కూడా లేకపోవటం అసంతృప్తికి దారితీసింది.  ముక్కుసూటిగా మాట్లాడే మోత్కుపల్లి బిజెపి లో ఇమడలేక పోయారనటంలో సందేహం లేదు.

తెలుగుదేశం పార్టీలో ఎన్.టి.ఆర్ ఆహ్వానం మేరకు చేరిన మోత్కుపల్లి చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా, మంత్రిగా ప్రజలకు సేవలు అందించారు. నిత్యం ప్రజల్లో ఉండే మోత్కుపల్లిని ఎన్ టి ఆర్ అభిమానించేవారు. తుంగతుర్తి, ఆలేరు నుంచి ఆరుసార్లు శాసనసభ్యునిగా గెలిచి, నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండేవారు.

సుదీర్ఘ కాలంగా రాజకీయాల్లో ఉన్న మోత్కుపల్లి నర్సింహులు త్వరలోనే తెరాసలోకి వస్తారని సమాచారం. తెలంగాణ రాష్ట్ర సమితిలో అధినాయకుడితోనే సన్నిహిత సంబంధాలు ఉండటం కలసివస్తుందనే అంచనాలో ఉన్నారు. తొందరలోనే టి.ఆర్.ఎస్ నేతగా మోత్కుపల్లి నర్సింహులు ప్రజల ముందుకు రానున్నారు.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్