నేపాల్ మాజీ ప్రధానమంత్రి కేపి శర్మ ఒలి మళ్ళీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే ఇండియా ఆధీనంలో ఉన్న కాలాపానీ, లిపులేఖ్, లిమ్పియదుర ప్రాంతాలను తిరిగి తీసుకుంటామని ప్రకటించారు. ఖాట్మండు సమీపంలోని చిత్వాన్ లో ఈ రోజు కమ్యూనిస్ట్ పార్టీ అఫ్ నేపాల్ మార్క్సిస్ట్,లెనినిస్ట్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో కేపి శర్మ ఒలి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాలాపానీ, లిపులేఖ్, లిమ్పియదుర ప్రాంతాలను రాజ్యాంగం ప్రకారం నేపాల్ కొత్త చిత్రపటంలో చూపుతూ నిర్ణయం తీసుకున్నామని, అయితే వాటిపై భారత్ తో చర్చలు జరిపి వెనక్కు తీసుకోవలసిన ఆవశ్యకత ఉందన్నారు.
అయితే ఒలి వ్యాఖ్యలపై నేపాల్ లోనే భిన్నఅభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. నేపాల్ ప్రభుత్వం ఒలి వ్యాఖ్యలపై స్పందించలేదు. దేశంలోని వివిధ వర్గాలు ఒలి వ్యాఖ్యల్ని తప్పు పట్టాయి. చర్చల ద్వారా పరిష్కరించుకునే అంశాల్ని రాజకీయాల కోసం వాడుకోవటం తగదని మేధావి వర్గాలు అన్నాయి. ఇండియాలోని నేపాల్ రాయబార కార్యాలయం కూడా ఒలి వ్యాఖ్యలపై ఎలాంటి స్పందన తెలపలేదు.
ఉత్తరాఖండ్ లోని లిపులేఖ్ నుంచి నేపాల్ మీదుగా కైలాష్ మానస సరోవరానికి రోడ్డును 2020 మే 8వ తేదిన భారత్ ప్రారంభించిన నాటి నుంచి వివాదం మొదలైంది. ఈ రోడ్డుపై ఒలి నేతృత్వంలోని నేపాల్ ప్రభుత్వం అప్పుడు అభ్యంతరం వ్యక్తం చేసింది. నేపాల్ కు చైనా మద్దతు ఇవ్వటంతో వివాదం మరింత ముదిరింది.