జపాన్ నూతన ప్రధానిగా ఫుమియో కిషిదా ఎన్నికయ్యారు. జపాన్ పార్లమెంట్( డైట్ ) ప్రత్యేక సమావేశంలో ఈ రోజు కిషిదా నాయకత్వానికి సభ్యులు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. 64 ఏళ్ల ఫుమియో కిషిదా ప్రస్తుతం జపాన్ విదేశాంగ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కొత్త ప్రధానికి కరోనా కట్టడి, చైనా, ఉత్తర కొరియా ల సైనిక బెదిరింపులు సవాల్ గా నిలువనున్నాయి. కొత్త బాధ్యతల్ని చేపట్టేందుకు సిద్దమని, ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థీక వ్యవస్థ జపాన్ ప్రతిష్ట కాపాడేందుకు కృషి చేస్తానని కిషిదా పేర్కొన్నారు. కిషిదా మంత్రివర్గంలో కొందరు మినహా అన్ని కొత్త మొహాలే పాలనా పగ్గాలు చేపట్టే అవకాశం ఉంది.
ప్రస్తుత ప్రధానమంత్రి యోషిహిదే సుగ రాజీనామా చేయటంతో కిషిదా ఎన్నిక అనివార్యం అయింది. అధికార లిబరల్ డెమోక్రాటిక్ పార్టీ లో అంతర్గత కుమ్ములాటలు అంతకంతకు పెరిగాయి. ఒలంపిక్స్ సమయంలో కరోనా కేసులు అమాంతంగా పెరగటం విమర్శలకు దారితీసింది. దీంతో పదవి నుంచి తప్పుకుంటానని సుగా గత నెలలోనే వెల్లడించారు. ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఏడాది తిరగక ముందే యోషిహిదే సుగ రాజీనామా చేయటం చర్చనీయాంశం అయింది.
కొత్త ప్రధానమంత్రి ఈ నెల 14 వ తేదిన దిగువ సభను రద్దు చేసి ఎన్నికలకు వెళ్ళే అవకాశం ఉందని జపాన్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ నెల 31వ తేదిన ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. డైట్ (జపాన్ పార్లమెంట్)లో సంకీర్ణానికి నాయకత్వం వహిస్తున్న లిబరల్ డెమోక్రాటిక్ పార్టీ రాబోయే ఎన్నికల్లో పట్టు నిలుపుకునే అవకాశం మెండుగా ఉంది.