Friday, March 29, 2024
Homeసినిమా'గార్గి' పోరాటం ఫలించినట్టేనా?

‘గార్గి’ పోరాటం ఫలించినట్టేనా?

Movie Review: సాయిపల్లవికి నాయిక ప్రధానమైన కథలను .. పాత్రలను ఎంచుకునే సమర్థత ఉంది. ఎలాంటి కథనైనా .. పాత్రనైనా తన  భుజాలపై చివరివరకూ మోయగల సామర్థ్యం ఉంది. తను గొప్పనటి ..  ఆ విషయాన్ని అందరూ అంగీకరించారు ..  అభిమానులుగా మారిపోయారు. సాయిపల్లవి ఒక సినిమాలో ఉందంటే ..  హీరో ఎవరనేది కూడా ప్రేక్షకులు పట్టించుకోవడం లేదు. ఆ సినిమాలో బలమైన కథ ఉంటుందనీ .. అందులో కొత్తదనం ఉంటుందని వాళ్లంతా నమ్ముతున్నారు. ఆమె కూడా ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ వస్తోంది.

సాయిపల్లవి తాజా చిత్రంగా నిన్న ‘గార్గి’ సినిమా వచ్చింది. తమిళ సినిమానే అయినా ప్రేక్షకులు ఈ సినిమాను అలా చూడలేదు. సాయిపల్లవి లుక్ నుంచి మొదలైన ఆసక్తి ట్రైలర్ తో మరింతగా పెరిగిపోయింది. దాంతో సినిమాలో ఏదో గట్టి విషయమే ఉండొచ్చని వెళ్లడం సహజం. నిజంగానే ఇది సాయిపల్లవి సినిమానే. ఆమె పాత్ర చుట్టూనే తిరిగే కథనే. ఆమె మాత్రమే ఈ పాత్రను ఈ స్థాయిలో పండించగలదు అనుకునే సినిమానే. ఎలాంటి  హంగులూ ఆర్భాటాలకు పోకుండా సహజత్వానికి చాలా దగ్గరగా వెళ్లిన సినిమానే. అందులో  ఎల్ ఆంటీ సందేహం లేదు.

ఒక గ్యాంగ్ రేప్ కేసులో అరెస్ట్ అయిన తండ్రిని నిర్దోషిగా భావించి, ఆయనను బయటకి తీసుకుని రావడానికి ప్రయత్నించే ఒక సగటు ఆడపిల్ల పాత్ర ఇది. పాత్రలోని అన్ని కోణాలను దర్శకుడు గౌతమ్ రామచంద్రన్ గొప్పగా ఆవిష్కరించాడు. అయితే ఎక్కడా కూడా టెన్షన్ బిల్డప్ చేయలేకపోయాడు. ఎంచుకున్న లైన్ విషయమున్నదే అయినా, దానిని ఉత్కంఠభరితంగా ఆవిష్కరించలేకపోయాడు. సహజత్వం పేరుతో కథలో పరుగు తగ్గింది. కథకి కమర్షియల్ అంశాలను జోడించడానికి అవకాశం ఉన్నప్పటికీ దర్శకుడు ఆ దిశగా ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు.

కథను .. సన్నివేశాలను వాస్తవానికి దగ్గరగా తీసుకుని వెళ్లాలనే దర్శకుడి ఆలోచన మంచిదే. అందుకోసమని కమర్షియల్ అంశాలకు మరీ దూరంగా వెళ్లవలసిన అవసరం లేదు. సినిమాను నిలబెట్టడానికి అవసరమయ్యేవి అవే. అవకాశం ఉన్నా  ఉపయోగించుకోకపోవడమే అసంతృప్తిని కలిగిస్తుంది. కథా పరంగా ‘గార్గి’ పోరాటానికి అవసరమైన ఆయుధాలను దర్శకుడు సమకూర్చగలిగి ఉంటే ఈ సినిమా మరో స్థాయికి వెళ్లేదే. సాయిపల్లవిని అభిమానించేవారు .. ఆమె నటనను ఇష్టపడేవారు ఈ సినిమాను చూడొచ్చు.

Also Read : ‘ది వారియర్’: విలన్ కోసం తన ప్రొఫెషన్ మార్చుకున్న హీరో కథ!

RELATED ARTICLES

Most Popular

న్యూస్