పార్లమెంట్ సభ్యుడు, మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ మరోసారి బ్యాట్ తో సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాడు. సెప్టెంబర్ 17 నుంచి మొదలుకానున్న లెజెండ్స్ లీగ్ క్రికెట్-2022 లీగ్ లో ఆడనున్నాడు. 2007, 2011 సంవత్సరాల్లో ఇండియా గెలిచిన ప్రపంచకప్ జట్లలో గంభీర్ సభ్యుడిగా ఉన్నాడు. తన క్రికెట్ కెరీర్ లో 147వన్డేలు, 37 టి -20లు ఆడి ఆరువేలకు పైగా పరుగులు, 37టెస్టుల్లో 932 పరుగులు సాధించాడు. ఐపీఎల్ లో 2008-18వరకూ ఆడిన గంభీర్ ఆ తర్వాత రాజకీయ రంగప్రవేశం చేసి బిజెపిలో చేరాడు. 2019 ఎన్నికల్లో తూర్పు ఢిల్లీ నియోజకవర్గం నుంచి లోక్ సభకు ఎన్నికయ్యాడు. నాలుగేళ్ల విరామం తర్వాత మళ్ళీ గంభీర్ మరోసారి బ్యాట్ తో తన ఆటను ప్రదర్సిన్చానున్నాడు.
మాజీ ఆటగాళ్ళు, ఇటీవలి కాలంలో రిటైర్ అయిన వారితో ఈ లీగ్ జరగనుంది. మొత్తం మూడు టీమ్ లు ఈ పాల్గొంటాయి, వీటిలో ఒకటి భారత క్రికెట్ మాజీ ఆటగాళ్ళు, రెండోది… భారత్ మినహా ఆసియా దేశాలకు చెందిన క్రీడాకారులు, మూడోది మిగిలిన ప్రపంచ దేశాలకు చెందిన క్రీడాకారులతో కూడిన జట్లు ఉంటాయి. ఇండియా మహారాజాస్, ఆసియ లయన్స్, వరల్డ్ జెయింట్స్ పేరిట ఈ జట్లు బరిలో దిగుతున్నాయి. ఒక్కో జట్టూ మిగిలిన రెండిటితో రెండేసి మ్యాచ్ లు ఆడనుంది. లీగ్ మ్యాచ్ ల్లో ఎక్కువ పాయింట్లు సాధించిన మొదటి రెండు జట్లూ ఫైనల్ ఆడతాయి.
ఈ ఏడాది జనవరి లో మొదటి సీజన్ టోర్నమెంట్ జరిగింది. మస్కట్ లోని ఒమన్ క్రికెట్ అకాడమీ గ్రౌండ్స్ లో జరిగిన గత సీజన్ లో వరల్డ్ జెయింట్స్, ఆసియా లెజెండ్స్ మధ్య ఫైనల్ జరగగా జెయింట్స్ 27పరుగులతో విజయం సాధించి తొలి లీగ్ విజేతగా నిలిచింది.
రెండో సీజన్ సెప్టెంబర్ 17నుంచి అక్టోబర్ 8వరకూ జరగనుంది, ఇండియా ఈ లీగ్ కు ఆతిథ్యం ఇస్తోంది. కోల్ కతా, లక్నో, ఢిల్లీ, కటక్, జోద్ పూర్, రాజ్ కోట్ ల్లో మ్యాచ్ లు జరగనున్నాయి.
ఈ సీజన్ ను భారత స్వాతంత్ర్య అమృతోత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కు అంకితం ఇస్తున్నట్లు రావిశాస్త్రి వెల్లడించారు. ఈ సందర్భంగా ఇండియా మహారాజాస్ – వరల్డ్ జెయింట్స్ మధ్య ఓ స్నేహపూర్వక మ్యాచ్ కోల్ కతాలో జరగనుంది. ఈ మ్యాచ్ కు మాత్రం బిసిసిఐ అధ్యక్షుడు, మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, ఇంగ్లాండ్ ఆటగాడు మోర్గాన్ ఇరు జట్లకూ సారధ్యం వహించనున్నారు.
ఆబ్సల్యూట్ లెజెండ్స్ స్పోర్ట్స్ ప్రైవేటు లిమిటెడ్ ఆధ్వర్యంలో జరుగుతోన్న ఈ లీగ్ కు మాజీ ఆటగాడు, మాజీ హెడ్ కోచ్ రవి శాస్త్రి కమిషనర్ గా వ్యవహరించనున్నాడు. బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు.
‘లెజెండ్స్ లీగ్ క్రికెట్ రాబోయే సీజన్ లో అడబోతున్నట్లు తెలియజేస్తున్నందుకు సంతోషిస్తున్నా’ అని గంభీర్ వ్యాఖ్యానించాడు.