పాలస్తీనాలోని గాజా నగరంలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. గాజా స్ట్రిప్‌లోని ఓ ఇంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో 21 మంది సజీవ దహనమయ్యారు. వారిలో తొమ్మిది మంది చిన్నారులు ఉన్నారు. గాజాలో అత్యధిక జనాసాంధ్రత ఉండే జబాలియా శరణార్థుల క్యాంపు ప్రాంతంలోని నాలుగంతస్తుల ఇంట్లో మంటలు చెలరేగాయని అధికారులు వెల్లడించారు. మొదట చివరి అంతస్తులో మంటలు అంటుకున్నాయని, క్రమంగా అవి బిల్డింగ్ మొత్తానికి వ్యాప్తి చెందాయని వెల్లడించారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. క్షతగాత్రులను స్థానిక దవాఖానకు తరలించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
ఈ అగ్నిప్రమాదాన్ని జాతీయ విషాదంగా పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ అభివర్ణించారు. కాగా, బిల్డింగ్‌లో ఓ ఇంట్లో ఇంధనం నిల్వ చేయడంతో అగ్నిప్రమాదం జరిగిందని సివిల్ డిఫెన్స్ యూనిట్ ప్రతినిధి చెప్పారు. గాజాలోని ఎనిమిది శరణార్థుల క్యాంపుల్లో జబాలియా ఒక్కటి. ఇక్కడ 20 లక్షల 30 వేల మంది నివాసముంటున్నారు.ఇది ప్రపంచంలోనే అత్యధిక జనసాంధ్రత కలిగిన శరణార్థి శిభిరంగా గుర్తింపు పొందింది.