టి-20 వరల్డ్ కప్ కు ముందు జరుగుతోన్న ఐపీఎల్ టోర్నీ ఆటగాళ్లకు ఎంతో ఉపయోగమని ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్ వెల్ అభిప్రాయపడ్డాడు. టి 20 టోర్నీలో సూపర్ 12 లో గ్రూప్ 1 లో ఆస్ట్రేలియా తో పాటు సౌతాఫ్రికా, ఇంగ్లాండ్, వెస్టిండీస్ జట్లు ఉన్నాయి. తమ గ్రూప్ లో ఉన్న జట్లు బలమైన జట్లని, వాటిని ఎదుర్కోవాలంటే ముమ్మర సాధన అవసరమని మాక్స్ వెల్ అన్నాడు. అందులోనూ రెండు టోర్నీలు దుబాయ్, ఒమన్ వేదికల్లోనే జరుగుతుండడం మరింత కలిసొస్తుందని, ఐపీఎల్ ద్వారా తమ ఆటగాళ్లకు మంచి ప్రాక్టీస్ లభిస్తుందని, పిచ్ లకు అలవాటు పడతారని పేర్కొన్నారు. గ్లెన్ మాక్స్ వెల్ ఐపీల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టుకు ప్రాతినిద్యం వహిస్తున్నాడు.
ఆరోన్ పించ్ నేతృత్వంలో 18 మందితో కూడిన జట్టును టి-20 కోసం ఆస్ట్రేలియా బోర్డు ప్రకటించింది. వీరిలో చాలామంది ఐపీఎల్ లో వివిధ ప్రాంచైజీలకు ఆడుతున్నారు. కోవిడ్ కారణంగా నిలిచిపోయిన ఐపీఎల్ సెప్టెంబర్ 19 నుంచి పునః ప్రారంభం అవుతున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 15 న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఇది ముగిసిన రెండో రోజు నుంచే అంటే అక్టోబర్ 17 నుంచి టి-20 సమరం మొదలు కానుంది. అయితే 22 వరకూ గ్రూప్ మ్యాచ్ లు జరుగుతాయి. సూపర్ 12 మ్యాచ్ లు మాత్రం 23 నుంచి మొదలవుతాయి. ఆస్ట్రేలియా తన మొదటి గేమ్ ను సౌతాఫ్రికాతో అక్టోబర్ 23న ఆడనుంది.
ఐసిసి టి-20 వరల్డ్ కప్ లో ప్రధాన జట్లు అన్నీ బలంగా ఉన్నాయని, ప్రతి మ్యాచ్ ఆసక్తికరంగా ఉంటుందని మాక్స్ వెల్ స్పష్టం చేశాడు. తమ వరకూ ప్రతి మ్యాచ్ కీలకమైనదిగానే భావిస్తామన్నాడు.