Monday, November 25, 2024
HomeTrending NewsVietnam: ఇక వీసా లేకుండానే వియత్నాం వెళ్ళొచ్చు

Vietnam: ఇక వీసా లేకుండానే వియత్నాం వెళ్ళొచ్చు

భారతీయులకు వీసా రహిత ప్రవేశాన్ని అనుమతించేందుకు మరో ఆసియా దేశం ముందుకు వస్తోంది. భారతదేశ పర్యాటకులకు మినహాయింపులతో స్వల్పకాలిక వీసాతో అనుమతి ఇవ్వాలని వియత్నాం యోచిస్తోంది. దేశ పర్యాటక రంగం పునరుద్ధరణ కోసం ఈ నిర్ణయం తీసుకుంటున్నారని ఆ దేశ వార్తా సంస్థ VN Express వెల్లడించింది. ఇదే జరిగితే శ్రీలంక, థాయ్‌లాండ్ తర్వాత భారతీయులకు వీసా రహిత ప్రవేశం కల్పిస్తున్న మూడో దేశంగా వియత్నాం అవతరిస్తుంది.

జర్మనీ, ఫ్రాన్స్, స్వీడన్, ఇటలీ, స్పెయిన్, డెన్మార్క్ మరియు ఫిన్లాండ్ జాతీయులు ప్రస్తుతం వీసా లేకుండా వియత్నాంలో ప్రయాణించవచ్చు. ఇప్పుడు భారత్, చైనా దేశాలకు వీసా లేకుండా అనుమతించాలని కసరత్తు చేస్తోంది. కరోనా మహమ్మారి వ్యాప్తికి ముందు సగటున సుమారు 1,70,000 మంది భారతీయ సందర్శకులు వియత్నాంలో పర్యటించేవారు.

ఫు క్వాక్ ద్వీపం, న్హా ట్రాంగ్, డా నాంగ్, హా లాంగ్ బే మరియు హోయి ఆన్ వంటి సుందరమైన ప్రదేశాలు భారతీయ పర్యాటకులను ఆకర్షించటంలో ప్రసిద్ధి చెందాయి. ఈ ఏడాది ఆగస్టు నుంచి వియత్నాం అన్ని దేశాలకు చెందిన వ్యక్తులకు ఇ-వీసాలను జారీ చేయడం ప్రారంభించింది. ఇ-వీసాలు 90 రోజుల చెల్లుబాటు వ్యవధితో బహుళ ఎంట్రీలకు అనుమతిస్తాయి.

రక్షణ రంగంలో ఇప్పటికే రెండు దేశాలు జతకట్టాయి. ఇందులో భాగంగా వియత్నాంకు యుద్ద నౌక ఐఎన్‌ఎస్‌ కృపాణ్‌ను భారత్ బహుమతిగా అందచేసింది. ఇరు దేశాల మధ్య పెరుగుతున్న వ్యూహాత్మక భాగస్వామ్యానికి గుర్తుగా 32 ఏండ్లుగా ఇండియన్‌ నేవీకి సేవలందిస్తున్న ఈ యుద్ధ నౌకను కానుకగా ఇచ్చింది.

భారతీయులకు వీసా రహిత ప్రవేశానికి అనుమతిస్తే రెండు దేశాల మధ్య వ్యాపార, వాణిజ్య రంగాల్లో గణనీయమైన ప్రగతి సాధ్యం అవుతుంది. ఔషధ గుణాలు కలిగిన నల్ల మిరియాల సాగులో వియత్నాం వృద్ది సాధించింది. జీడిపప్పు ఉత్పత్తిలో ప్రపంచంలో రెండో స్థానంలో ఉన్న వియత్నాం నుంచి దిగుమతులకు అవకాశాలు ఉన్నాయి. ఇక్కడి నుంచి దిగుమతులు పెరిగితే మన దేశంలో జీడిపప్పు ధరలు తగ్గి సామాన్యులకు అందుబాటులోకి రావచ్చు.

వియత్నాంలో అనేక బాషలు ఉన్నా క్రమంగా ఇంగ్లీష్ ప్రాధాన్యత పెరుగుతోంది. ఫ్రెంచ్ విరివిగా ఉపయోగిస్తున్నా అంతర్జాతీయంగా ఇంగ్లీష్ ప్రాబల్యం ఉండటంతో ఆంగ్లం నేర్చుకునేందుకు దేశ యువత ఆసక్తి కనపరుస్తోంది. విద్యా రంగంలో ఆంగ్లం బోధించే భారతీయులు మంచి అవకాశాలు పొందవచ్చు.

దక్షిణ కొరియాకు ఆహారం, దుస్తులు, వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులు వియత్నాం నుంచే ఎగుమతి అవుతాయి. ఆయా రంగాల్లో చొరవ తీసుకునేందుకు భారతీయ సంస్థలకు వీసా రహిత విధానం ఉపయోగపడుతుంది. వీసా రహిత ప్రవేశం ఎప్పటి నుంచి అనేది స్పష్టత రాలేదు. దీనిపై తొందరలోనే వివరంగా ప్రకటన రానుంది.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్