అమెరికాలోని మౌంటెన్ వ్యూలో ఉన్న తమ ప్రధాన కార్యాలయం తర్వాత టెక్ దిగ్గజం గూగుల్ 3.3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో హైదరాబాద్‌లో నిర్మించతలపెట్టిన రెండవ అతిపెద్ద క్యాంపస్‌కు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ హైదరాబాద్లోని ఖాజాగూడ సమీపంలో ఈ రోజు శంకుస్థాపన చేశారు. తెలంగాణ ప్రభుత్వం, గూగుల్ సంస్థ మధ్య అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. పౌర సేవలు, విద్య, ఇతర రంగాల్లో ప్రభుత్వానికి గూగుల్ సాంకేతిక సహకారాన్ని అందించనుంది. ఇప్పటికే అనేక ప్రాజెక్టుల్లో గూగుల్‌తో కలిసి పని చేస్తున్నామని కేటీఆర్ తెలిపారు.
ఈ ఒప్పందంతో మరింత మెరుగైన సేవలు అందించేందుకు అవకాశం ఏర్పడుతుందని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో గూగుల్ తన మూలాలను మరింత బలోపేతం చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. గూగుల్ 2017 నుంచి తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పని చేస్తోందని తెలిపారు. ఇంతకు ముందు చేసుకున్న ఎంవోయూలు గొప్ప కార్యక్రమాలకు దారి తీశాయన్నారు. యువత, మహిళలు, విద్యార్థులు, పౌరసేవల్లో మార్పు తీసుకురావడంపై దృష్టి సారించామని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపి రంజిత్ రెడ్డి, ఐటి శాఖ కార్యదర్శి జయేష్ రంజాన్ గూగుల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ సంజయ్ గుప్త తదితరులు పాల్గొన్నారు.
Also Read : భారతదేశానికే తెలంగాణ దిక్సూచి – కేటిఆర్