జగనన్న గోరుముద్ద ద్వారా నేటి నుండి వారానికి 3 రోజుల పాటు రాగి జావ అందించే కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి క్యాంప్‌ కార్యాలయం నుండి లాంఛనంగా ప్రారంభించనున్నారు,  ఈ ఉదయం నుంచే బడి పిల్లలకు రాగిజావ అందిస్తారు.

రాష్ట్రవ్యాప్తంగా 44,392 ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లోని 37,63,698 మంది విద్యార్ధులకు  ఏటా రూ. 86 కోట్ల అదనపు వ్యయంతో ఈ రాగిజావ ఇవ్వనున్నారు. మధ్యాహ్న పథకానికి గత ప్రభుత్వం పెట్టిన ఖర్చు ఏటా సగటున రూ. 450 కోట్లయితే దాదాపు 4 రెట్లు అధికంగా జగనన్న గోరుముద్ద క్రింద ఏడాదికి చేస్తున్న ఖర్చు రూ. 1,824 కోట్లు, రాగిజావకు ఏటా మరో రూ. 86 కోట్లతో మొత్తం రూ. 1,910 కోట్ల వ్యయం చేస్తున్నామని ప్రభుత్వం వెల్లడించింది.

మధ్యాహ్న భోజన పథకంలో ఇప్పటికే సమూల మార్పులు చేసి  ప్రభుత్వం గోరుముద్ద ద్వారా ప్రతి రోజూ మెనూ మార్చి బలవర్ధకమైన, మెరుగైన, రుచికరమైన, నాణ్యమైన పౌష్టికాహారం  అందిస్తోంది. సిఎం జగన్ దీనిపై ప్రత్యేక శ్రద్ధ వహించి స్వయంగా ఆయనే మెనూను రూపొందించారు.

ఐరన్, కాల్షియం వంటి పోషకాలు అందించి విద్యార్ధుల్లో రక్తహీనత, పోషకాల లోపాన్ని నివారించేందుకు వారానికి మూడు రోజులు (మంగళ, గురు, శని) బెల్లంతో కూడిన రాగిజావను ఇస్తారు. జగనన్న గోరుముద్దలో భాగంగా ఇప్పటికే వారానికి 15 వెరైటీలు, ఐదు రోజుల పాటు గుడ్డు, 3 రోజులు చిక్కీ, ఇకపై 3 రోజులు రాగిజావ కూడా మెనూలో ఉంటుంది.

రాగి జావ మెనూలో చేర్చడం ద్వారా  చిరుధాన్యాలు పండించే రైతులకు ప్రోత్సాహం కూడా లభిస్తుంది. ఈ ఏడాది అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం కావడం గమనార్హం. ఈ  పథక నిర్వహణలో భాగంగా శ్రీ సత్యసాయి సెంట్రల్‌ ట్రస్ట్‌తో ఎంవోయూ కుదుర్చుకుంది. గత ప్రభుత్వం ఇచ్చిన దానికి 3 రెట్లు అధికంగా వంట సహాయకులకు నెలకు రూ. 3,000 గౌరవ భృతి, క్రమం తప్పకుండా గోరుముద్ద బిల్లుల చెల్లిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *