సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవీ విరమణకు ఒక రోజు ముందు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ హైదరాబాద్ జర్నలిస్టులకు తీపికబురు అందించారు. సుదీర్ఘకాలంగా ఇళ్ల స్థలాల కోసం పోరాడుతున్న హైదరాబాద్ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపు, నిర్మాణానికి పచ్చజెండా ఇస్తూ ఆదేశాలు జారీ చేశారు. జర్నలిస్టులు, బ్యూరోక్రాట్లు, ప్రజా ప్రతినిధులకు ఇళ్లస్థలాల కేటాయింపు కేసులో ఈ రోజు విచారణ జరిపిన ప్రధానన్యాయముర్తి జర్నలిస్టుల వ్యవహారాన్ని బ్యూరోక్రాట్లు, ప్రజా ప్రతినిధులతో ముడిపెట్టకూడదని వ్యాఖ్యానించారు.
జర్నలిస్టులకు 12 ఏళ్ల క్రితం ప్రభుత్వం స్థలాన్ని కేటాయించిందని, ఐఏఎస్, ఐపీఎస్‌ల గురించి తాను మాట్లాడ్డం లేదని, ఓ చిన్న జర్నలిస్టు ఎందుకు ఇబ్బందిపడాలని ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు. రూ. 8,000 నుంచి రూ. 50 వేల జీతం తీసుకునే సుమారు 8వేల మంది జర్నలిస్టులు అభ్యర్థనను పరిగణలోకి తీసుకుంటున్నామన్నారు. వారికి భూమి కేటాయించారు. కానీ అభివృద్ధి చేయలేదని, వారంతా కలిసి స్థలం కోసం రూ. 1.33 కోట్లు డిపాజిట్ చేశారని సీజేఐ గుర్తు చేశారు. జర్నలిస్టుల స్థలాన్ని వారు స్వాధీనం చేసుకోడానికి సర్వోన్నత న్యాయస్థానం తరపున అనుమతిస్తున్నామని సీజేఐ ఎన్వీ రమణ స్పష్టం చేశారు. వారి స్థలంలో నిర్మాణాలు కూడా జరుపుకోవచ్చని స్పష్టం చేశారు. ఐఏఎస్, ఐపీఎస్, ఎంపీలకు సంబంధించిన మిగతా కేసును ఇంకో బెంచ్ ముందు లిస్టు చేయండని చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ఆదేశించారు.
జర్నలిస్టుల ఇండ్ల స్ఠలాల కేసును పరిష్కరించిన CJI ఎన్వీ రమణకి తెలంగాణ జర్నలిస్టు సంఘాలు కృతఙ్ఞతలు తెలిపాయి.
Also Read : అంబేద్కర్ వల్లే నేను ఈ స్థాయిలో జస్టిస్ ఎన్వీ రమణ